
Ram Charan-Sukumar: బాక్సాఫీస్ వద్ద రికార్డుల తుఫాను సృష్టించిన ‘రంగస్థలం’ తర్వాత.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న మెగా ప్రాజెక్ట్‌పై సినీ ప్రియుల్లో ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ చివరి దశకు చేరుకోగా, ఈ పాన్-ఇండియా ధమాకాను అధికారికంగా లాంచ్ చేసేందుకు చిత్ర బృందం డేట్ కూడా లాక్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రేజీ కాంబోను అక్టోబర్ 20న అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో, సరికొత్త సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
అక్టోబర్‌లో లాంచ్ చేసిన అనంతరం, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను శరవేగంగా మొదలుపెట్టనున్నారట. చిత్రీకరణను ఏకధాటిగా కొనసాగించి, 2027 చివరి నాటికి పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనేది యూనిట్ పక్కా ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన అంశం రామ్ చరణ్ లుక్. గతంలో ‘చిట్టిబాబు’ పాత్రతో నటనలో విశ్వరూపం చూపించిన చరణ్, ఈసారి అంతకుమించిన సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. సుకుమార్ రాసుకున్న డిఫరెంట్ అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేందుకు చరణ్ ఇప్పటికే తీవ్ర కసరత్తులు మొదలుపెట్టారు. పాత్ర డిమాండ్ మేరకు ఆయన ప్రస్తుతం శరవేగంగా బరువు తగ్గుతూ (వెయిట్ లాస్), కొత్త ఫిజిక్‌లోకి మారుతున్నారు. చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ స్క్రీన్‌పై ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు, ఈ భారీ ప్రాజెక్ట్‌లో చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పాన్-ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న ఓ స్టార్ హీరోయిన్‌ను ఫైనల్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారట. మరి అక్టోబర్ 20న ముహూర్తం ఫిక్స్ అయ్యిందో కాలేదో మరికొన్ని రోజుల్లో తేలనుంది.
