
Ranabali Runtime: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన భారీ పీరియడ్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సినిమా విడుదలైన తొలి ఆట నుంచే సోషల్ మీడియాలో కథ, యాక్షన్ ఎపిసోడ్లపై ప్రశంసలు వస్తున్నప్పటికీ.. కొందరు మాత్రం సినిమా నిడివి (రన్‌టైమ్) కాస్త ఎక్కువగా ఉందంటూ కామెంట్లు చేశారు. ఈ అంశంపై చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ నిర్వహించిన సక్సెస్ మీట్లో స్పందిస్తూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. కథలోని భావోద్వేగం ప్రేక్షకుల గుండెల్లోకి దిగాలంటే ఆ మాత్రం నిడివి ఉండాల్సిందేనని, ఆ లెంత్ సినిమాకు అత్యంత అవసరమని రాహుల్ స్పష్టం చేశారు.
సినిమా రన్‌టైమ్ గురించి వస్తున్న విమర్శలు, చర్చలపై రాహుల్ సంకృత్యాన్ నేరుగా స్పందించారు. “సినిమా నిడివి ఎంత ఉందనేది ముఖ్యం కాదు.. కథకు ఎంత అవసరమో అంతే ఉంచాం. ‘రణబాలి’లో చాలా బరువైన, గుండెల్ని పిండేసే బలమైన సన్నివేశాలు (హార్డ్ హిట్టింగ్ సీన్స్) ఉన్నాయి. సన్నివేశాలు గబగబా ఫాస్ట్‌గా వెళ్లిపోతే అందులోని భావోద్వేగపు బరువు (ఎమోషనల్ వెయిట్) ఆడియన్స్‌కు ఎలా సింక్ అవుతుంది? ప్రేక్షకులు ఆ కథా ప్రపంచంలోకి వెళ్లి ఆ బరువును అనుభవించాలంటే ఆ సమయం కచ్చితంగా కావాలి. అందుకే కథకు న్యాయం చేసే విధంగానే లెంత్ డిజైన్ చేశాం.” సినిమా విడుదలైన తొలి ఉదయం సోషల్ మీడియాలో కనిపించిన వాతావరణాన్ని గుర్తుచేసుకుంటూ రాహుల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఉదయం లేవగానే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో భిన్నమైన అభిప్రాయాలు కనిపించాయని, అయితే ఎప్పుడైతే తెలుగు మీడియా ప్రతినిధులకు షో పడిందో.. అప్పటి నుంచే సినిమా గమనం పూర్తిగా మారిపోయిందని తెలిపారు.
ఫస్ట్ హాఫ్ నుంచే మీడియా పాజిటివ్ రివ్యూలు, బ్లాక్‌బస్టర్ టాక్ ఇవ్వడం వల్లే బయట ఉన్న తప్పుడు ప్రచారాలన్నీ పటాపంచలయ్యాయని, ఈ విజయంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంలో కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, బ్రిటీష్ కాలం నాటి చరిత్ర, ఆకలి, సమాజంలోని అంతరాలు, పలు రాజకీయ కోణాలను ఎంతో లోతుగా చూపించామని దర్శకుడు పేర్కొన్నారు. సాధారణంగా ఇంత హెవీ సబ్జెక్ట్‌ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అనుకున్నామని, కానీ ప్రేక్షకులు ఒక్కో లేయర్‌ను అర్థం చేసుకుంటూ సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలతో విశ్లేషిస్తుండటం చూస్తుంటే ఒక దర్శకుడిగా ఎంతో గర్వంగా ఉందని రాహుల్ ఆనందం వ్యక్తం చేశారు. సినిమా సాధించిన ఈ భారీ విజయాన్ని ఇంకా పూర్తిస్థాయిలో జీర్ణించుకోలేకపోతున్నానని, త్వరలోనే మరింత విపులంగా మాట్లాడతానని ముగించారు.
