Site icon TeluguMirchi.com

Ranveer Singh: ‘ధురంధర్‌’ తర్వాత రణ్‌వీర్‌ మాస్‌ ప్లాన్‌.. ‘ప్రళయ్‌’ షూటింగ్‌ స్టార్ట్!

Ranveer Singh

Ranveer Singh: ధురంధర్ చిత్రాలతో చాలా కాలంగా ఆకలితో ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ దాహాన్ని తీర్చిన స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. తాజాగా ఆయన తన కొత్త సినిమా ‘ప్రళయ్’ను అధికారికంగా ప్రారంభించారు. ధురంధర్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా స్టార్టింగ్ నుంచే ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని పోస్ట్‌ అపోకలిప్టిక్‌ సర్వైవల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ముంబై పరిసర ప్రాంతాల్లోని లైవ్‌ లొకేషన్లలో చిత్రీకరించనున్నారట. ‘స్కామ్‌ 1992: ది హర్షద్‌ మెహతా స్టోరీ’, ‘లూటేరే’ వంటి ప్రశంసలు అందుకున్న సిరీస్‌లకు దర్శకత్వం వహించిన జై మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హన్సల్‌ మెహతా కుమారుడైన జై.. చాలాకాలంగా ఈ కథపై పనిచేస్తున్నట్లు సమాచారం. జై మెహతా, విశాల్‌ కపూర్‌ కలిసి ఈ ఒరిజినల్‌ స్టోరీని డెవలప్ చేశారు.

ఇక ఈ సినిమాలో ‘లోకా’ చిత్రంతో ఇండియా లెవల్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. కుప్పకూలుతున్న ప్రపంచంలో మనుగడ కోసం జరిగే పోరాటం, ధైర్యం, విలువైన వాటిని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాల చుట్టూ ఈ సినిమా కథ సాగనున్నట్లు సమాచారం. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను బిర్లా స్టూడియోస్‌, హన్సల్‌ మెహతా-సాహిల్‌ సైగల్‌కు చెందిన ట్రూ స్టోరీ ఫిలింస్‌, రణ్‌వీర్‌ సింగ్‌ సొంత నిర్మాణ సంస్థ మా కసమ్‌ ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌, విభిన్న కథతో తెరకెక్కుతున్న ‘ప్రళయ్‌’పై బాలీవుడ్‌లో ఇప్పటికే ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

Exit mobile version