
RAPO23 Title: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లో ‘RAPO23’ ప్రాజెక్ట్ ప్రత్యేకంగా నిలవనుంది. ఈ సినిమాతో తొలిసారి నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ రామ్ మెగాఫోన్ పట్టనున్నారు. ప్రస్తుతం వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా అవుట్‌పుట్ విషయంలో రామ్ ఎంతో పట్టుదలగా పనిచేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్ షెడ్యూల్‌లో ఆయన ఏకంగా 24 గంటల పాటు నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ప్రాజెక్ట్‌ను అనుకున్న స్థాయిలో తీర్చిదిద్దేందుకు రామ్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్న తీరు ప్రస్తుతం సినీ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘RAPO23’కి ‘ఏక – ది లోన్ వోల్ఫ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు టాక్. సినిమా కథ, టోన్‌కు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టైటిల్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చీకటి ప్రపంచం నేపథ్యంలో సాగే నియో – నోయిర్ స్టోరీతో కూడిన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కథలోని ఇంటెన్స్ నేచర్‌కు తగ్గట్టుగానే ‘ఏక – ది లోన్ వోల్ఫ్’ అనే టైటిల్ ఆసక్తిని పెంచుతోందని అంటున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విలక్షణ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి ‘ఏక – ది లోన్ వోల్ఫ్’ టైటిల్‌నే ఫైనల్ చేస్తారా? లేక మరో పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
