Site icon TeluguMirchi.com

Rashmika: సౌత్ యాస ఉంటే తప్పేంటి? ట్రోలర్ల నోళ్లు మూయించిన రష్మిక మందన్న!

Rashmika

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఏ పని చేసినా, ఎలాంటి సినిమా ఎంచుకున్నా సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదం లేదా ట్రోలింగ్ ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో హిందీ డైలాగులు చెబుతున్నప్పుడు సౌత్ యాస వినిపిస్తోందంటూ కొందరు నెటిజన్లు చేసే కామెంట్స్‌పై తాజాగా రష్మిక గట్టి కౌంటర్ ఇచ్చారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో సందడి చేసిన రష్మిక.. తన యాస, కెరీర్‌పై ఎదురవుతున్న విమర్శలపై ఓపెన్‌గా స్పందిస్తూ ట్రోలర్ల చెంప చెల్లుమనిపించేలా మాట్లాడారు.

హిందీ సినిమాల్లో తన డైలాగ్ డెలివరీపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. “నా హిందీలో దక్షిణాది యాస వినిపిస్తోందని కొందరు ఎగతాళి చేస్తున్నారు. అసలు నేను పుట్టి పెరిగింది సౌత్ ఇండియాలోనే. అలాంటప్పుడు నా మాటల్లో ఆ యాస కాకుండా వేరేది ఎలా వస్తుంది? నా సహజమైన యాసను తప్పుపట్టడంలో ఎలాంటి అర్థం లేదు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నన్ను ఏదో ఒక విషయంలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు. నా యాక్టింగ్, నా భాష, డైలాగులు చెప్పే విధానం.. ఇలా ఏ ఒక్కదాన్నీ వదిలిపెట్టలేదు” అంటూ తన ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఎవరో ఏదో అన్నారని తాను ఎప్పుడూ హద్దులు గీసుకోలేదని స్పష్టం చేశారు. “ఇలాంటి పనికిమాలిన ట్రోలింగ్ వల్ల నేను అవకాశాలు వదులుకోలేదు. ఒక్క భాషకే పరిమితం కావాలనీ అనుకోలేదు. పాన్-ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తున్నప్పుడు డబ్బింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా. ఒకవేళ నా గొంతు కంటే వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ బాగుంటుందని డైరెక్టర్ అనుకుంటే మార్చుకోవచ్చని వాళ్లకే స్వేచ్ఛనిస్తా. కానీ, ఇప్పటివరకు నాతో పనిచేసిన దర్శకులంతా నా గొంతుతోనే డబ్బింగ్ చెప్పించాలని అనుకున్నారు. ఇన్ని భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం చాలా కష్టమైన పనే అయినా, దాన్ని సక్సెస్ ఫుల్‌గా చేయడంలోనే నాకు సంతృప్తి ఉంది” అని రష్మిక తేల్చి చెప్పారు. విమర్శలను పట్టించుకోకుండా వరుస పాన్-ఇండియా ప్రాజెక్టులతో దూసుకుపోతున్న రష్మిక, తన నేచురల్ యాసను వెనకేసుకొస్తూ ఇచ్చిన ఈ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Exit mobile version