Site icon TeluguMirchi.com

Rashmika: భార్యగా కాదు.. ఒక అభిమానిగా వచ్చా: రష్మిక మందన్న

Rashmika

Rashmika: టాలీవుడ్ గోల్డెన్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల కాంబోకు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో యూత్‌ను ఉర్రూతలూగించిన ఈ స్టార్ జోడీ.. రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యాక కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ భారీ పీరియాడిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేదికపై రష్మిక మందన్న తన భర్త విజయ్ గురించి మాట్లాడుతూ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

వేదికపై విజయ్‌ను ముద్దుగా “విజ్జు” అంటూ సంబోధిస్తూ రష్మిక మాట్లాడిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. “నిజం చెప్పాలంటే మా ఇద్దరికీ పెళ్లయిపోయిందన్న భావన నాకు ఇప్పటికీ కలగట్లేదు. ఈ వేదికపైకి వచ్చాక కూడా నేను తన భార్యలా కాకుండా, విజ్జుకు ఒక డైహార్డ్ ఫ్యాన్ గర్ల్‌లాగే ఫీలవుతున్నాను. ఆయన నటన, డెడికేషన్ అంటే నాకు ఎప్పటినుంచో అమితమైన ఇష్టం. ‘రణబాలి’ సినిమాలో ఆయన విశ్వరూపం చూసేందుకు మీలాగే నేనూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా” అంటూ రష్మిక చెప్పిన మాటలకు ప్రాంగణమంతా అభిమానుల ఈలలు, కేరింతలతో దద్దరిల్లింది.

షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ రష్మిక నవ్వులు పూయించారు. “టీమ్ మొత్తం నెలల తరబడి ఎండనకా, వాననకా రాత్రింబవళ్లు చాలా సీరియస్‌గా కష్టపడింది. నేను మాత్రం మధ్యమధ్యలో నాలుగైదు రోజులు సరదాగా పిక్నిక్‌కు వచ్చినట్లు వెళ్లి హాయిగా షూటింగ్‌లో పాల్గొన్నాను. కానీ సెట్‌లో విజయ్ మాత్రం తన మీసాలు తిప్పుతూ, ఆ పౌరుషమైన పాత్రలో జీవిస్తూ డైలాగులు చెబుతుంటే నాకే ఒళ్లు గగుర్పొడిచింది, ఒకానొక దశలో భయమేసింది కూడా! టీమ్ అంతా ‘గాడ్ మోడ్’లో పనిచేశారు. ఈ సినిమాకు నేనే మొదటి ప్రేక్షకురాలిని.. థియేటర్లలో ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ మరో ప్రపంచంలోకి వెళ్లడం ఖాయం” అని రష్మిక ధీమా వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో తన పాత్ర గురించి చెబుతూ.. “డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ నాకు కథ వినిపించినప్పుడు నా పాత్ర పేరు ‘జయమ్మ’ అని చెప్పారు. నిజానికి అది మా అమ్మ పేరే.. దాంతో ఆ క్యారెక్టర్‌కు వెంటనే మానసికంగా కనెక్ట్ అయిపోయాను. మేము గతంలో చేసిన సినిమాలు క్యూట్ లవ్ స్టోరీస్. కానీ ‘రణబాలి’ కేవలం ప్రేమకథ మాత్రమే కాదు. అద్భుతమైన లవ్ ట్రాక్ ఉన్నప్పటికీ, దీని కథా పరిధి చాలా విస్తృతమైనది, సమాజానికి అవసరమైనది. ఇలాంటి పాత్ర దక్కడం నా అదృష్టం” అని పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తన సొంత ఇల్లు లాంటిదని, అజయ్-అతుల్ అందించిన మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెబుతూ.. అక్టోబర్ 16న ప్రతి ఒక్కరూ థియేటర్లలో ‘రణబాలి’ చిత్రాన్ని చూడాలని రష్మిక కోరారు.

Exit mobile version