Site icon TeluguMirchi.com

Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’ శబరిమల కథ కాదా? శివ నిర్వాణ ఏం చెప్పారంటే!

Irumudi

Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్, కథ నేపథ్యంపై దర్శకుడు శివ నిర్వాణ కీలక విషయాలను వెల్లడించారు. ఆధ్యాత్మికంగా ‘ఇరుముడి’ అంటే అయ్యప్ప స్వామి దీక్షలో భాగంగా భక్తులు శబరిమల యాత్ర సమయంలో తలపై మోసుకెళ్లే పవిత్రమైన ఇరుముడి కట్టు. దీంతో రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా కూడా శబరిమల లేదా అయ్యప్ప స్వామి దర్శనం చుట్టూనే తిరుగుతుందా? అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.

అయితే ఈ మూవీకి శబరిమల లేదా అయ్యప్ప స్వామి దర్శనంతో నేరుగా సంబంధం లేదని శివ నిర్వాణ స్పష్టం చేశారు. హీరో జీవితంలో 41 రోజుల పాటు సాగే అయ్యప్ప దీక్ష ఒక ముఖ్యమైన భాగం మాత్రమేనని తెలిపారు. ఆ 41 రోజుల దీక్షకు ముందు, ఆ సమయంలో హీరో జీవితంలో చోటుచేసుకునే పరిణామాలే సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయని చెప్పారు. దీంతో ‘ఇరుముడి’ కేవలం ఆధ్యాత్మిక అంశాల చుట్టూ సాగే సినిమా కాదని స్పష్టమవుతోంది. తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం, కుటుంబ భావోద్వేగాలతో పాటు హీరో జీవితంలో చోటుచేసుకునే కీలక పరిణామాలను దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు. సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ‘ఇరుముడి’పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

Exit mobile version