
Romanchakam Censor: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. ఇప్పుడు నిర్మాతగానూ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఆయన సమర్పణలో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం ‘రోమాంచకం’. యువ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంటగా నటించిన ఈ సినిమాకు వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. యూత్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ లవ్, కామెడీ అంశాలతో కూడిన ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ‘మేము ఫేమస్’, ‘గోదారి గట్టుపైన’ సినిమాలతో సుమంత్ ప్రభాస్ ఇప్పటికే యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ చిత్రంలో అనంతిక సనిల్‌కుమార్ హీరోయిన్‌గా నటించారు.
ఇప్పటికే విడుదలైన ‘రోమాంచకం’ టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. రిలీజ్ తేదీ దగ్గరపడటంతో చిత్రబృందం కూడా ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇటీవల గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. తాజాగా ‘రోమాంచకం’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే మూవీ రన్‌టైమ్‌ను 1 గంట 42 నిమిషాల 40 సెకన్లుగా ఖరారు చేశారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘రోమాంచకం’ సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. మరి యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ లవ్-కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
