Site icon TeluguMirchi.com

Sai Durgha Tej: వెంకన్న ఆశీస్సులతో బరిలోకి సాయి దుర్గ తేజ్.. ‘సంబరాల ఏటి గట్టు’పై భారీ అంచనాలు!

Sai Durgha Tej

Sai Durgha Tej: మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఆయన.. ఇప్పుడు ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలతో పాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల ‘సంబరాల ఏటి గట్టు’ విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ సాయి దుర్గ తేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్న ఆయన.. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.

దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన సాయి దుర్గ తేజ్.. ‘సంబరాల ఏటి గట్టు’ విడుదల తేదీని ఇటీవలే ప్రకటించామని, సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆయన ఆనందంగా కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ‘సంబరాల ఏటి గట్టు’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సాయి దుర్గ తేజ్ ఈ సినిమాలో మాస్ యాక్షన్‌తో పాటు ఎమోషనల్ యాంగిల్‌లోనూ కనిపించనున్నట్లు సమాచారం. ఆయన పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్‌ను దర్శకుడు ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో.. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను రిచ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. వచ్చే సంక్రాంతి సీజన్‌లో ‘సంబరాల ఏటి గట్టు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీవారి ఆశీస్సులతో ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సాయి దుర్గ తేజ్.. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.

Exit mobile version