
Salman Khan: సెలబ్రిటీల జీవిత కథలతో బయోపిక్‌లు తీసి బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టడం ఈ మధ్య కామన్ అయిపోయింది. అయితే బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ జీవితంపై సినిమా వస్తే ఎలా ఉంటుంది? ఆయన లైఫ్‌లో ఉన్న ట్విస్టులు, కాంట్రవర్సీలు, లవ్ స్టోరీలు వెండితెరపై చూస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. కానీ, ఈ క్రేజీ ఆలోచనకు సల్మాన్ ఖాన్ ఒక్క మాటతో ఫుల్స్టాప్ పెట్టేశాడు. తన కథతో సినిమా తీసే సీన్ ఎవరికీ లేదని, ఆ విషయాలన్నీ తనతో పాటే సమాధి అయిపోతాయని కుండబద్దలు కొట్టాడు. త్వరలోనే ‘మాతృభూమి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సల్మాన్, రీసెంట్గా ఓ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు ఈ కామెంట్స్ చేశాడు. ఎవరైనా మీ లైఫ్ స్టోరీ ఆధారంగా బయోపిక్ తీసే ఛాన్స్ ఉందా అని అడిగితే.. భాయ్ ఏమాత్రం తడుముకోకుండా చాలా బోల్డ్‌గా బదులిచ్చాడు.
“నా జీవితంపై ఎప్పటికీ బయోపిక్ వచ్చే ఛాన్సే లేదు. నా లైఫ్‌లో జరిగిన సంఘటనలు, ఎవరికీ తెలియని సీక్రెట్స్, అసలైన కథలు అన్నీ నాతో పాటే సమాధిలోకి పోతాయి తప్ప బయటకు రావు” అని సల్మాన్ తేల్చి చెప్పాడు. ఇదే క్రమంలో తన పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుతూ.. “పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలనేది కంప్లీట్‌గా నా సొంత నిర్ణయం. నన్నెవరూ ఆపలేదు, ఎవర్నీ బ్లేమ్ చేయాల్సిన పనీ లేదు. ఇలా ఉండటంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ, ఏదో ఒక రోజు తండ్రి కావాలని మాత్రం నాకూ బలంగా ఉంది” అని తన మనసులో మాట బయటపెట్టాడు. ఎవరికీ దొరకని ఎన్నో చీకటి, వెలుగుల కోణాలు సల్మాన్ జీవితంలో ఉన్నాయి. అలాంటి కథ వెండితెరపైకి వస్తే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతుంటే.. “ఆ సీక్రెట్స్ ఎవరికీ దక్కవు” అంటూ సల్మాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
