
Sampoornesh Babu: న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు అందరి మనసులను హత్తుకున్నాయి. తన సినీ కెరీర్‌లోనే ఇది అత్యంత కీలకమైన మలుపు అని చెబుతూ సంపూ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఆడియన్స్‌ను కదిలించాయి.
సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. “ఒక నటుడికి కొన్ని పాత్రలు గుర్తింపు తెస్తాయి, మరికొన్ని అవార్డులు తెచ్చిపెడతాయి. కానీ చాలా అరుదుగా వచ్చే కొన్ని పాత్రలు మనం ఎవరో ప్రపంచానికి చూపిస్తాయి. దర్శకుడు శ్రీకాంత్ అన్న నాకు కేవలం ఒక పాత్ర రాయలేదు.. చాలా రోజులుగా మౌనంగా ఉండిపోయిన నా గొంతుకు ఒక రూపాన్ని ఇచ్చాడు. అదే సినిమాలో నేను చేసిన ‘బిర్యానీ’ పాత్ర” అంటూ దర్శకుడిపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. తన సినీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ.. “నా చిన్న జర్నీలో ఇది అతిపెద్ద సినిమా. నా కెరీర్‌లో అత్యధిక రోజులు షూటింగ్‌లో పాల్గొన్న చిత్రం కూడా ఇదే. నాని అన్న పక్కన నన్ను నమ్మి శ్రీకాంత్ అన్న ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాని అన్నతో కలిసి పనిచేయడం వల్ల నటనలో ఇంకా ఎంతో నేర్చుకోవాలని అర్థమైంది. నా కడుపులో పొట్టు పొట్టు ఆకలి ఉంది.. నటుడిగా ఆ ఆకలి సెప్టెంబర్ 24న ఈ సినిమాతో తీరబోతోంది” అని సంపూ ఆవేదన, ఆనందం కలగలిసిన గొంతుతో చెప్పారు.
చిత్ర బృందం పనితీరును మెచ్చుకుంటూ.. “శ్రీకాంత్ అన్న ఎంత పట్టుదల గల వ్యక్తో, ఆయన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోని వాళ్లు కూడా అంతే మొండోళ్లు. నాని అన్న చెప్పినట్లు వాళ్ల కసి చూస్తుంటే భవిష్యత్తులో ఈ టీమ్ నుంచే మరికొందరు శ్రీకాంత్ ఓదెలలు పుట్టుకొస్తారనే నమ్మకం కలిగింది” అని పేర్కొన్నారు. అనిరుధ్ మ్యూజిక్ ఉన్న ఇంత గొప్ప సినిమాలో భాగం కావడం, రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ డైరెక్షన్‌లో చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నిర్మాత సుధాకర్ చెరుకూరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎల్లప్పుడూ ప్రేక్షకుల ప్రేమకు బానిసనై ఉంటానని సంపూర్ణేష్ బాబు తన స్పీచ్‌ను ముగించారు. ‘ది ప్యారడైజ్’లో సంపూ చేసిన ‘బిర్యానీ’ పాత్ర ఆయన కెరీర్‌కు ఎలాంటి టర్నింగ్ పాయింట్ కానుందో చూడాలి.
