Site icon TeluguMirchi.com

Sandeep Reddy Vanga: ‘ఆనంద్‌లో ఆ పిచ్చి అప్పుడే కనిపించింది’.. సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga: హైదరాబాద్‌లో జరిగిన ‘ఎపిక్’ ఫస్ట్ సెమిస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, ‘90s’ రచయిత ఆదిత్య హాసన్‌ గురించి ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ ప్రమోషన్స్‌ కోసం అమెరికా వెళ్లిన సందర్భాన్ని సందీప్ రెడ్డి వంగా గుర్తుచేసుకున్నారు. అప్పట్లో విజయ్ దేవరకొండకు తమ్ముడు ఆనంద్ కూడా తమను కలిసేందుకు కాలిఫోర్నియా నుంచి డల్లాస్ వచ్చాడని తెలిపారు. అప్పట్లో ఆనంద్ పూర్తిగా ఫార్మల్ దుస్తుల్లో, క్లీన్ షేవ్‌తో ఐటీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిలా కనిపించాడని చెప్పారు.

‘‘మేమంతా రాత్రి నాలుగు గంటల వరకు సినిమాలు, పాటలు, టీజర్ గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆనంద్ కూడా మాతోనే ఉండేవాడు. మాకు ఫుడ్ ఆర్డర్ చేస్తూ చూసుకునేవాడు. కానీ సినిమా డిస్కషన్స్‌లో మాత్రం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేవాడు. అప్పట్లో అతనిలో ఇంత ప్యాషన్ ఉందని నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఐటీ జాబ్ చేస్తున్నాడనుకున్నా. కానీ మేం మాట్లాడే విషయాలను అతను చాలా తీక్షణంగా వింటుండేవాడు’’ అని సందీప్ తెలిపారు. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ ఒక్కసారిగా హీరోగా పరిచయం కావడం తనకు సర్‌ప్రైజ్‌గా అనిపించిందని చెప్పారు. ‘దొరసాని’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్.. ఆ తర్వాత ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’, ‘బేబీ’ వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించాడని ప్రశంసించారు. తాను నమ్మిన పాత్రను ప్రేక్షకులు కూడా నమ్మేలా ఆనంద్ సహజంగా నటించాడని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.

తక్కువ సమయంలోనే ఆనంద్ మంచి సినిమాలు చేశాడని ఆయన అన్నారు. దాదాపు ఆరు సంవత్సరాల సినీ ప్రయాణంలో నాలుగు, ఐదు మంచి చిత్రాలు చేశాడని ప్రశంసించారు. ఇక ‘ఎపిక్’ హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి కూడా సందీప్ రెడ్డి వంగా మాట్లాడారు. ఆమెను తాను గతంలో షార్ట్ ఫిల్మ్స్‌లోనే చూశానని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ సిస్టర్ పాత్ర, ‘బేబీ’ వంటి సినిమాలతో వైష్ణవి మంచి గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. తక్కువ సమయంలోనే ఆమె తనకంటూ ప్రత్యేకమైన నటనా ప్రయాణాన్ని ఏర్పరుచుకుందని ప్రశంసించారు. ‘90s’ వెబ్ సిరీస్ తనకు ఎంతో నచ్చిందని సందీప్ తెలిపారు. ముఖ్యంగా సుబ్బి, సుహాసిని పాత్రలను చూసి తాను చాలా నవ్వుకున్నానని, ఆ తర్వాత తన పిల్లలు సిరీస్ చూస్తున్నప్పుడు వారితో కలిసి కూర్చొని చూశానని చెప్పారు. రైటర్ ఆదిత్య హాసన్ రైటింగ్ తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఇది ఆయన తొలి రచనా ప్రయత్నంలా అనిపించలేదని ప్రశంసించారు.

‘ఎపిక్’ టీజర్, ట్రైలర్, మ్యూజిక్ తనకు బాగా నచ్చాయని సందీప్ రెడ్డి వంగా అన్నారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. సెప్టెంబర్ 11న ‘ఎపిక్’ ప్రేక్షకుల ముందుకు రానుందని, సెప్టెంబర్ 10న ప్రీమియర్స్ ఉన్నాయని అన్నారు. చివరగా ‘ఎపిక్’ చిత్రబృందానికి సందీప్ రెడ్డి వంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Exit mobile version