
Shraddha Kapoor: బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసింది. ‘స్త్రీ’, ‘స్త్రీ 2’ చిత్రాల బ్లాక్‌బస్టర్ విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ నటి.. తాజాగా తను నటిస్తున్న తాజా బయోపిక్ చిత్రం ‘ఈత’ (Eetha) కోసం తన రెమ్యునరేషన్‌ను ఏకంగా రూ.15 కోట్లకు పెంచేసినట్లు బాలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. శ్రద్ధా కపూర్ కెరీర్‌లోనే ఇది అత్యధిక పారితోషికం కావడం విశేషం. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ లావణి, తమాషా జానపద నృత్య కళాకారిణి ‘వితాబాయి నారాయణగాంకర్’ జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ దినేష్ విజన్ (మ్యాడాక్ ఫిలిమ్స్).. శ్రద్ధా కపూర్‌కు ఇస్తున్న ఈ భారీ పారితోషికాన్ని పూర్తిగా సమర్థించారు. వితాబాయి బయోపిక్ శ్రద్ధా కపూర్ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, ఆమె నటనకు ఈ రెమ్యునరేషన్ కచ్చితంగా అర్హమైనదేనని ఆయన గట్టిగా నమ్ముతున్నారట.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌లో గర్భవతిగా ఉంటూనే వేదికపై వితాబాయి చేసిన నృత్యం, ప్రసవం తర్వాత వెంటనే మళ్లీ స్టేజ్ ఎక్కిన సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. రణదీప్ హుడా, మహ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు ‘ఈత’ అని పేరు పెట్టడంపై వితాబాయి కుటుంబ సభ్యులతో పాటు ఎన్‌సీపీ (NCP) సాంస్కృతిక విభాగం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాకు ‘వితాబాయి’ అనే పేరే ఉంచాలని వారు డిమాండ్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం నార్త్ బెల్ట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
