Site icon TeluguMirchi.com

Shruti Haasan Case: శృతి హాసన్‌ కేసులో కోర్టు సంచలన వ్యాఖ్యలు.. AI ఫేక్‌లకు చెక్!

Shruti Haasan

Shruti Haasan Case: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) సాయంతో రూపొందిస్తున్న డీప్‌ఫేక్‌ వీడియోలు, మార్ఫింగ్‌ కంటెంట్‌, తప్పుడు ఎండార్స్‌మెంట్లపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ నటి శృతి హాసన్‌కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం.. ఇలాంటి కృత్రిమ కంటెంట్‌ వల్ల వ్యక్తిగత ప్రతిష్ఠ, గుడ్‌విల్‌కు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. జస్టిస్‌ మాధవ్‌ జమ్దార్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. AI ద్వారా రూపొందించిన లేదా మార్చిన వీడియోలు, తప్పుడు ప్రకటనలు ఒక వ్యక్తి ప్రతిష్ఠను దెబ్బతీస్తే, ఆ నష్టాన్ని కేవలం ఆర్థిక పరిహారంతో పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ముఖ్యంగా ప్రజల్లో ఒక వ్యక్తికి ఉన్న ఇమేజ్‌, గౌరవం, విశ్వసనీయతకు కలిగే నష్టం మరింత తీవ్రమైనదని పేర్కొంది.

AI సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్‌ఫేక్‌లు, మార్ఫింగ్‌ వీడియోలు, తప్పుడు ఎండార్స్‌మెంట్ల సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డిజిటల్‌ యుగంలో AI దుర్వినియోగాన్ని అడ్డుకునే దిశగా ఈ నిర్ణయం కీలక ముందడుగుగా అభిమానులు, సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ముఖం, పేరు లేదా గుర్తింపును ఉపయోగించి తప్పుడు కంటెంట్‌ను సృష్టించడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా వ్యక్తిగత గోప్యత, గౌరవానికి సంబంధించిన రాజ్యాంగ హక్కులను ధర్మాసనం ప్రస్తావించింది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి కంటెంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వ్యక్తుల హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

Exit mobile version