
Shruti Haasan: కమల్ హాసన్ వారసురాలిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తాజాగా తన సినీ ప్రయాణంపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. యాక్టింగ్ అనేది తన జీవితంలో అసలు ఫస్ట్ ఛాయిస్ కాదని, ఒకానొక దశలో మొదటి సినిమాతోనే వెండితెరకు పూర్తిగా గుడ్‌బై చెప్పాలని భావించినట్లు ఆమె ఓపెన్‌గా వెల్లడించారు. కొచ్చి వేదికగా నిర్వహించిన ‘ఇండియా టుడే సౌత్ 2026’ సదస్సులో పాల్గొన్న శృతి, తన కెరీర్ ఆరంభంలో ఎదురైన ఊహించని మలుపులను పంచుకున్నారు.
ఘనమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ, శృతిహాసన్ మదిలో రచయిత్రి కావాలనే బలమైన ఆకాంక్ష ఉండేదట. అయితే పరిస్థితులు ఆమెను నటన వైపు నడిపించాయి. “‘హే రామ్’ షూటింగ్ సమయంలో నేను కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తున్నా. ఆ సినిమాలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కుమార్తె పాత్ర కోసం అర్జెంట్‌గా ఒక ఆర్టిస్ట్ అవసరమైంది. నాన్న అడగడంతో కాదనలేక ఆ చిన్న వేషం వేశాను. అలా నా ప్రయాణం అనుకోకుండా మొదలైంది” అని శృతి గుర్తు చేసుకున్నారు.
2009లో బాలీవుడ్ చిత్రం ‘లక్’ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆ సినిమా తర్వాత చిత్ర పరిశ్రమను శాశ్వతంగా వదిలేయాలని ఆమె గట్టిగా నిశ్చయించుకున్నారట. ఆ సినిమాకు వచ్చిన రెమ్యునరేషన్‌తో మ్యూజికల్ డ్రమ్ కిట్, మిక్సర్ కన్సోల్ కొనుగోలు చేసి పూర్తిగా సంగీతానికే అంకితం కావాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆ చిత్రంలో తన నటనను స్క్రీన్‌పై చూసుకున్న తర్వాత ఆమె ఆలోచన పూర్తిగా మారిపోయింది. “లక్‌లో నా పర్ఫార్మెన్స్ నాకే ఏమాత్రం నచ్చలేదు. నటిగా నేను ఇంత వీకా అనిపించింది. నా ప్రతిభ ఏంటో నిరూపించుకోవాలన్న కసి, పట్టుదల ఆ క్షణంలోనే మొదలయ్యాయి. అందుకే సంగీతాన్ని పక్కనపెట్టి నటనను చాలా సీరియస్‌గా తీసుకున్నాను” అని శృతిహాసన్ స్పష్టం చేశారు. ఆ ఛాలెంజే నేడు ఆమెను దక్షిణాదిలోనే అత్యధిక డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్‌లో ఒకరిగా నిలబెట్టింది.
