Site icon TeluguMirchi.com

Siddharth: విలన్‌గా నటిస్తా.. కానీ అలా మాత్రం చేయను! సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్

Siddharth

Siddharth: ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ సిరీస్‌తో నటుడు సిద్ధార్థ్ మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఈ సిరీస్‌లో ఆయన నటనకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల ఎంపిక, పాత్రల స్వభావం, ఐటెం సాంగ్స్‌ గురించి సిద్ధార్థ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెరపై తాను ఎలాంటి పాత్రలు చేయాలనే విషయంలో తనకు స్పష్టమైన ఆలోచన ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను హీరో పాత్రలో నటించనప్పుడు కూడా నటుడిగానే కొనసాగుతానని సిద్ధార్థ్ చెప్పారు. ప్రతి సినిమాలోనూ తానే హీరోగా కనిపించాలనే నియమం తనకు లేదని స్పష్టం చేశారు. అయితే విలన్ పాత్ర పోషించినప్పుడు అతడినే హీరోగా చూపిస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టించే విధమైన పాత్రలను మాత్రం అంగీకరించనని పేర్కొన్నారు. అలాంటి పాత్రలు చేస్తే అది తన ఆలోచనా విధానానికి సరిపోదని అన్నారు.

అలాగే తన కెరీర్‌లో ఇప్పటివరకు ఐటెం సాంగ్స్‌లో నటించలేదని సిద్ధార్థ్ తెలిపారు. ముఖ్యంగా మహిళను వస్తువులా చూపిస్తూ, ఆమె చుట్టూ పెద్ద సంఖ్యలో పురుషులు ఉండే విధంగా చిత్రీకరించే ప్రత్యేక గీతాలను తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. అలాంటి పాటల్లో భాగం కావడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. విలన్‌గా నటించడంపై తనకు అభ్యంతరం లేదని సిద్ధార్థ్ చెప్పారు. అయితే ఆ పాత్రకు కథలో తగిన ముగింపు ఉండాలని అన్నారు. సినిమాలో చెడు పనులు చేసే విలన్ చివర్లో తనకు తగిన శిక్షను పొందితే అలాంటి పాత్ర చేయడానికి సిద్ధమేనని పేర్కొన్నారు. కానీ సమాజానికి హాని చేసే పనులు చేస్తూ చివరికి విజయం సాధించే విలన్ పాత్రలను మాత్రం అంగీకరించనని స్పష్టం చేశారు. తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు ఎలాంటి ప్రభావం కలుగుతుందనే విషయాన్ని కూడా తాను పరిగణనలోకి తీసుకుంటానని సిద్ధార్థ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Exit mobile version