
Sivakarthikeyan: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘సేయోన్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కొనసాగుతుండగానే.. శివకార్తికేయన్ నెక్ట్స్ సినిమాలకు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శివకార్తికేయన్ హీరోగా ‘డాన్’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సిబి చక్రవర్తితో ఆయన మరో సినిమా చేయబోతున్నట్లు తాజాగా కన్ఫర్మ్ అయింది. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘డాన్’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ కాంబోపై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
సిబి చక్రవర్తికి గతంలో న్యాచురల్ స్టార్ నానితో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తోనూ సినిమా చేయాల్సి ఉండగా.. ఆ ప్రాజెక్ట్ కూడా వేరే కారణాలతో ముందుకు సాగలేదు. ఇక శివకార్తికేయన్ ప్రస్తుతం ‘సేయోన్’పై ఫోకస్ పెట్టారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత సిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ‘పార్కింగ్’ ఫేమ్ దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్‌తో శివకార్తికేయన్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ‘పార్కింగ్’తో రామ్‌కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సిబి చక్రవర్తి–శివకార్తికేయన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన కథ, హీరోయిన్, నిర్మాణ సంస్థ, ఇతర నటీనటుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. మరోసారి ఈ కాంబో తెరపైకి రావడంతో కోలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి నుంచే ఆసక్తి పెరుగుతోంది.
