Site icon TeluguMirchi.com

SPB: నెల్లూరు టు దేశ అత్యున్నత పురస్కారం.. ఎస్పీ బాలు స్పెషల్ స్టోరీ!

SP Balasubrahmanyam

SPB: భారతీయ సంగీత సామ్రాజ్యంలో ఆయనొక ధ్రువతార. ఐదు దశాబ్దాలకు పైగా కోట్లాది మంది గుండెలను తన అమృత గాత్రంతో ఓలలాడించిన ఆ గానగంధర్వుడి జ్ఞాపకాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెల్లూరు గడ్డపై పుట్టిన ఎస్. పి.బాలసుబ్రహ్మణ్యం (SPB) ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హృదయాలను గెలుచుకున్నారు. నిన్న ఆయన జయంతి సందర్భంగా బాలు గారి అపురూప ప్రయాణాన్ని, ఆయన గొప్పతనాన్ని గుర్తుచేసుకుంటూ ఇండస్ట్రీ దిగ్గజాలు, అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ స్టోరీలో ఆయన ఐదు దశాబ్దాల సంగీత ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

భారతీయ సంగీత శిఖరం
1946లో నెల్లూరులో జన్మించిన ఎస్పీ బాలు, 1966లో ఒక గాయకుడిగా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. నాలుగు వేర్వేరు భాషల్లో ఏకంగా 6 జాతీయ అవార్డులను అందుకొని చరిత్ర సృష్టించారు. భారత ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించింది. మరణానంతరం ఆయనకు ‘పద్మవిభూషణ్’ అవార్డును ప్రకటించి గౌరవించింది.

‘బాలు’ను గుర్తుచేసుకున్న ఇళయరాజా, కమల్ హాసన్..
సంగీత విద్వాంసుడు, బాలు గారి ప్రాణస్నేహితుడు ఇళయరాజా స్టేజ్‌పై వారద్దరూ కలిసి ఉన్న అపురూపమైన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి భావోద్వేగ పోస్ట్ చేశారు. “ఒక ట్యూన్‌ను బాలు ఎంత వేగంగా అర్థం చేసుకునేవాడో, సంగీతంపై అతనికి ఎంతటి గాఢమైన ఏకాగ్రత ఉండేదో” అంటూ ఇళయరాజా తన స్నేహితుడి ప్రతిభను కొనియాడారు. లోకనాయకుడు కమల్ హాసన్ బాలు గారి గురించి ఒక అద్భుతమైన నోట్‌ను షేర్ చేశారు. తెరపై కమల్ నటనకు, తెర వెనుక బాలు గొంతుకు ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ సందర్భంగా అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.

డోలీ మోసే వ్యక్తి కాళ్లకు నమస్కారం..
బాలు గారు కేవలం గొప్ప గాయకుడు మాత్రమే కాదు, అంతకంటే గొప్ప మనిషి అని చెప్పడానికి నెటిజన్లు ఆయన పాత వీడియోలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా శబరిమల యాత్రలో తనను మోసుకెళ్లిన ఒక డోలీ మోసే వ్యక్తి కాళ్లకు బాలు గారు నమస్కరించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతటి స్టార్‌డమ్ ఉన్నా, ఆయన చూపించిన వినమ్రత, మానవత్వం అందరి హృదయాలను గెలుచుకుందని నెట్టిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 74 ఏళ్ల వయసులోనూ బాలు గారు స్టేజ్ మీద అంతే పవర్‌ఫుల్‌గా, హై పిచ్‌లో పాడిన లైవ్ పర్ఫార్మెన్స్ వీడియోలను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. “బాధల్లో ఉన్నప్పుడు మా మనసులను నయం చేసే ఏకైక హీలర్ బాలు గారే” అంటూ ఫ్యాన్స్ నివాళులర్పిస్తున్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా.. తన గాత్రంతో అమరుడై ప్రతి గుండె చప్పుడులో బాలు బతికే ఉంటారని కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version