
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో పాటు ప్రమోషనల్ వ్యూహాల విషయంలోనూ చిత్రబృందం ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా మహేష్ బాబుకు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘వారణాసి’ ప్రమోషనల్ కార్యక్రమాలు పూర్తయ్యే వరకు మహేష్ బాబు ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనకూడదని, వేదికలపై మాట్లాడకూడదని డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి ప్రత్యేకంగా సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా చుట్టూ ఉన్న సస్పెన్స్, హైప్‌ను కొనసాగించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ కారణంగానే ఇటీవల జరిగిన జైకృష్ణ తొలి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కూడా మహేష్ బాబు హాజరుకాలేదని సమాచారం.
రాజమౌళి తన సినిమాల విషయంలో అనుసరించే క్రమశిక్షణ గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. నటీనటుల లుక్, సినిమా వివరాలు, ప్రమోషన్ల విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ చర్చనీయాంశమవుతుంటాయి. ఇప్పుడు మహేష్ బాబుకు సంబంధించిన ఈ ప్రచారం కూడా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే మహేష్ బాబుపై విధించిన ఈ ఆంక్షల గురించి చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
