
TVK MLA Ticket: తమిళనాడులో సినిమా, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేశారు. ఇదే క్రమంలో తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత దళపతి విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టి సీఎం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రముఖ సినీ దర్శకుడి రాజకీయ అరంగేట్రానికి విజయ్ బ్రేక్ వేసినట్లు తమిళ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. టీవీకే తరఫున ఓ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆసక్తిని ఓ ప్రముఖ దర్శకుడు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చేందుకు విజయ్ నిరాకరించినట్లు ఎమ్మెల్యే, టీవీకే కీలక నేత బుస్సీ ఆనంద్ వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి. సదరు నియోజకవర్గంలో ఇప్పటికే ఓ నాయకుడు గత రెండేళ్లుగా పార్టీ కోసం చురుగ్గా పనిచేస్తున్నారని, అందుకే ఆయనకే ప్రాధాన్యం ఇవ్వాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను పక్కనపెట్టి కేవలం సినీ రంగంలో తనకు ఉన్న పరిచయాలు, సన్నిహితుల ఆధారంగా టికెట్లు ఇవ్వడం విజయ్‌కు ఇష్టం లేదని బుస్సీ ఆనంద్ పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించడమే విజయ్ విధానంగా ఉందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అయితే టీవీకే నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన ఆ దర్శకుడు ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అధికారికంగా పేరు బయటకు రాకపోవడంతో సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తమ అంచనాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ దర్శకుడు ఎవరు? ఆయన నిజంగానే టీవీకే టికెట్ కోరారా? అనే అంశాలపై తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
