Site icon TeluguMirchi.com

Arya: తమిళ హీరోపై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు

Actor Arya

Arya: కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య చుట్టూ సరికొత్త వివాదం ముసురుకుంది. షూటింగ్ సామగ్రికి సంబంధించిన డబ్బులు చెల్లించకుండా మోసం చేశారనే ఆరోపణలపై ఆయనపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ ఘటన సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సినీ పరికరాల సరఫరా సంస్థ ‘తాహేర్ సినీ టెక్నిక్’ ప్రతినిధులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇటీవల ఆర్య హీరోగా తెరకెక్కిన ఒక సినిమా నిర్మాణ సమయంలో, షూటింగ్‌కు అవసరమైన హై-ఎండ్ కెమెరాలు, లైటింగ్, ఇతర సాంకేతిక పరికరాలను సదరు సంస్థ నుంచి అద్దెకు తీసుకున్నారు. అయితే, చిత్రీకరణ పూర్తయి సినిమా విడుదలైనప్పటికీ, వీటికి సంబంధించిన అద్దె బకాయిలు రూ.1.80 కోట్లను నిర్మాణ సంస్థతో పాటు హీరో ఆర్య ఇంకా చెల్లించలేదని బాధితులు పేర్కొన్నారు. డబ్బులు చెల్లించాల్సిందిగా పలుమార్లు సంప్రదించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకపోగా, సదరు సంస్థ ప్రతినిధిని బెదిరింపులకు గురిచేసినట్లు ఫిర్యాదులో వివరించారు. ఈ మేరకు మోసం, బెదిరింపుల ఆరోపణల కింద హీరో ఆర్యతో పాటు సదరు సినిమా నిర్మాణ సంస్థపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, బకాయిల లావాదేవీల పత్రాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Exit mobile version