Site icon TeluguMirchi.com

TFPC ఎన్నికల్లో సీ.కళ్యాణ్ ప్యానెల్ హవా.. కీలక పోస్టులన్నీ కైవసం!

TFPC

TFPC Election Results: టాలీవుడ్‌లో తీవ్ర ఆసక్తి రేపిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. పోలింగ్ అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల అధికారులు విజేతల జాబితాను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత సీ. కళ్యాణ్ నేతృత్వంలోని ప్యానెల్ సత్తా చాటింది. కీలక పదవులన్నింటినీ ఆ ప్యానెల్ అభ్యర్థులే దక్కించుకుని ఘన విజయం సాధించారు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా సీ.కళ్యాణ్ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో మిగిలిన కార్యవర్గ పదవులకు జరిగిన పోటీపై ఆసక్తి నెలకొంది. తాజాగా వెలువడిన ఫలితాల్లోనూ కళ్యాణ్ ప్యానెల్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

ఉపాధ్యక్షులుగా మోహన్ వడ్లపట్ల, కేఎల్ దామోదర్ ప్రసాద్ (దాము) ఎన్నికయ్యారు. మోహన్ వడ్లపట్లకు అత్యధికంగా 338 ఓట్లు రాగా.. దాము 274 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కోశాధికారి పదవికి జరిగిన ఎన్నికలో చదలవాడ శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు. ఆయనకు ఏకంగా 383 ఓట్లు లభించాయి. జాయింట్ సెక్రటరీలుగా అమ్మిరాజు కానుమిల్లి (416), తుమ్మలపల్లి రామసత్యనారాయణ (398) ఎన్నికయ్యారు. ఇక 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సభ్యుల ఎన్నికలోనూ పలువురు ప్రముఖ నిర్మాతలు విజయం సాధించారు. పద్మిని నాగులపల్లి 426 ఓట్లతో అత్యధిక ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. మైత్రి మూవీ మేకర్స్‌కు చెందిన రవిశంకర్ యలమంచిలి (మైత్రి రవి) 412 ఓట్లు, సునీల్ నారంగ్ 411 ఓట్లు సాధించి తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఈసీ సభ్యులుగా జేవీ మోహన్ గౌడ్ (404), శివలెంక కృష్ణప్రసాద్ (397), డీవీవీ దానయ్య (360), వంశీ నందిపాటి (355), పల్లి కేశవరావు (345), డీఎస్ రావు (337), వజ్జ శ్రీనివాసరావు (329), జే. పుల్లారావు (325), బాపిరాజు బల్లిపాడు (324), పి. రామకృష్ణాగౌడ్ (304), ఎస్కే నయీమ్ అహ్మద్ (285), కే. నిరంజన్ రెడ్డి (281) ఎన్నికయ్యారు. తాజా ఫలితాలతో TFPCలో సీ. కళ్యాణ్ ప్యానెల్ తన ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుకుంది. నిర్మాతల మండలి భవిష్యత్ కార్యాచరణ, పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలపై కొత్త కార్యవర్గం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version