
Tollywood Heroines: సినీ పరిశ్రమలో గ్లామర్, టాలెంట్ ఎంత ఉన్నా.. అంతిమంగా నిలబెట్టేది మాత్రం ‘సక్సెస్’ ఒక్కటే. ఒక శుక్రవారం వెలిగిపోయిన స్టార్లే, వరుస పరాజయాలు ఎదురైతే ఒక్కసారిగా మాయమైపోయే పోటీ ప్రపంచం ఇది. ప్రస్తుతం టాలీవుడ్‌లో నలుగురు ప్రముఖ హీరోయిన్స్ సరిగ్గా ఇలాంటి సంక్షోభంలోనే చిక్కుకున్నారు. వరుస ఫ్లాపులు, సరైన అవకాశాలు లేక సతమతమవుతున్న వీరికి రాబోయే ప్రాజెక్టులే ‘డూ ఆర్ డై’గా మారాయి. ఈ సినిమాల రిజల్ట్ తేడా కొడితే టాలీవుడ్‌లో వీరి ప్రయాణం దాదాపు క్లోజ్ అయినట్లేనన్న చర్చ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
న్యాచురల్ యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్‌కు ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ఆ స్థాయి విజయం దక్కలేదు. ప్రస్తుతం సుమంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘మహేంద్రగిరి వారాహి’ పైనే ఆమె కొండంత ఆశలు పెట్టుకుంది. ఈ మిస్టీరియస్ కాన్సెప్ట్ చిత్రం ఆమె కెరీర్‌కు మళ్లీ ఊపునిస్తుందో లేదో చూడాలి. మరోవైపు, కెరీర్ స్టార్టింగ్‌లో భారీ సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘బేబమ్మ’ కృతి శెట్టి పరిస్థితి మరీ దారుణంగా మారింది. వరుస పరాజయాలు ఆమె గ్రాఫ్‌ను అమాంతం పడేశాయి. ప్రస్తుతం వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతి బరిలో (జనవరి 12న) రాబోతున్న భారీ ప్రాజెక్టే ఆమెకు ఏకైక లైఫ్‌లైన్. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బ్లాక్‌బస్టర్ అయితేనే కృతి మళ్లీ రేసులోకి వస్తుంది.
పాన్ ఇండియా సంచలనం ‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాటు ‘హిట్ 3’ లాంటి ప్రాజెక్టుల్లో కనిపించినా.. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఊహించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఆమె ‘ఆదర్శ కుటుంబం’ ప్రాజెక్ట్‌పైనే పూర్తి దృష్టి సారించింది. ఈ సినిమాతోనైనా టాలీవుడ్‌లో కమర్షియల్ లీడింగ్ లేడీగా నిలదొక్కుకోగలదా అన్నది ప్రశ్నార్థకం. ఇక ‘జాతి రత్నాలు’తో చిట్టిగా కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లాది మరో వ్యథ. ఆ మొదటి సినిమా సృష్టించిన ఇంపాక్ట్ తర్వాత ఆమెకు మళ్లీ ఆ స్థాయి సాలిడ్ హిట్ తగలలేదు. ప్రస్తుతం సందీప్ కిషన్‌తో జతకడుతున్న సిగ్మా మూవీపైనే ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ నలుగురు భామలకు ఈ రిలీజులే కెరీర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ బొమ్మ హిట్టయితే బండి మళ్లీ స్పీడందుకుంటుంది.. ఏమాత్రం తేడా వచ్చినా కొత్త ముఖాల వెల్లువలో వీరు రేసు నుంచి పూర్తిగా తప్పుకోవాల్సిందే.
