
Tollywood Theater Issue: టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు థియేటర్లు దక్కడం లేదంటూ దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది న్యాయపోరాటానికి దిగారు. ‘ఓ అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడైన ఆయన.. థియేటర్ల కేటాయింపులో వివక్ష జరుగుతోందని ఆరోపిస్తూ పలువురు ప్రముఖులకు ఫైనల్ లీగల్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబుతో పాటు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులైన భరత్ భూషణ్, నాగవంశీ, అశోక్ కుమార్, ప్రసన్న కుమార్‌లకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు. అలాగే థియేటర్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందంటూ PVR INOX, ఏసియన్ సినిమాస్‌కు చెందిన కొందరు ప్రతినిధులకు కూడా లీగల్ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
వంద సినిమాలు విడుదలైతే కేవలం రెండు, మూడు చిత్రాలకే ఎక్కువ థియేటర్లు కేటాయించి.. మిగిలిన సినిమాలను పట్టించుకోవడం లేదని షిరాజ్ మెహది ఆరోపించారు. చిన్న సినిమాల సమస్యలపై గత ఏడాది కాలంగా తాను వివిధ వేదికలపై మాట్లాడుతున్నప్పటికీ స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులకు స్పందించకపోతే తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. థియేటర్ల వ్యవస్థలో కొందరి ఆధిపత్యం కొనసాగుతోందని, దాని వల్ల చిన్న నిర్మాతలు, దర్శకులు, నటులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై షిరాజ్ మెహది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన ఫిర్యాదుతో పాటు సంబంధిత ఆధారాలను సీఎం కార్యాలయానికి అందించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే షిరాజ్ మెహది చేసిన ఆరోపణలపై సంబంధిత నిర్మాతలు, థియేటర్ సంస్థలు లేదా ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. దీంతో ఈ వ్యవహారం టాలీవుడ్‌లో ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
