
Uppu Kappurambu : ‘ఉప్పుకప్పురంబు’ సినిమాతో సర్పంచ్ పాత్రలో కొత్తగా కనిపించబోతున్న హీరోయిన్ కీర్తి సురేష్, ఈ సినిమాపై, తన పాత్రపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సెటైరికల్ కామెడీ జోనర్‌లో ఇదే తన మొదటి ప్రయత్నమని, కథ వినూత్నంగా అనిపించిందని చెప్పారు. “ఈ సినిమా చేయడం నాకు చాలా కొత్త అనుభవంగా ఉంటుంది” అని చెప్పిన కీర్తి, ఈ సినిమాకు కేవలం ఐదు రోజుల్లోనే డబ్బింగ్ పూర్తిచేశానని చెప్పారు. “మహానటి సినిమాతోనే నేను తెలుగు బాగా నేర్చుకున్నాను. ఆ సినిమాకు 11 రోజులపాటు డబ్బింగ్ చెప్పాను. కానీ ‘ఉప్పుకప్పురంబు’కు ఐదు రోజుల్లోనే పూర్తి చేయగలిగాను. ‘నేను శైలజ’ తప్ప, మిగతా నా అన్ని సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను” అని తెలిపారు. తన సినిమాలు హిందీలో OTTల్లో బాగా వీక్షణలు రాబడుతున్నాయని కూడా చెప్పారు. దర్శకుడు శశి గురించి మాట్లాడుతూ, ఆయన ప్రముఖ మలయాళ దర్శకుడు IV శశి కుమారుడని, తన తల్లి కూడా ఆయనతో కలిసి పనిచేశారని గర్వంగా పేర్కొన్నారు.
ఇంటర్వ్యూలో హీరో సుహాస్, దర్శకుడు అని శశి, నిర్మాత రాధికలు పాల్గొన్నారు. కథ కొత్తగా అనిపించడంతోనే ఈ సినిమాలో నటించానని, తాను చేసే పాత్రల్లో వైవిధ్యం ఉండాలనే ఉద్దేశంతో డీ గ్లామర్ పాత్రకు ఓకే చెప్పానని సుహాస్ తెలిపారు. తన పాత్ర సీరియస్‌గా ఉండి కామెడీ పండించేలా రూపొందించిందన్నారు. దర్శకుడు శశి మాట్లాడుతూ, తన తొలి చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’ తెలుగులోనే తీసినట్టు తెలిపారు. ఈ సినిమా ద్వారా మనుషుల భావోద్వేగాలను విభిన్న కోణాల్లో చూపించారని చెప్పారు. కోవిడ్ తరువాత థియేటర్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ప్రేక్షకులకు నేరుగా చేరే మార్గంగా వివిధ భాషల్లో OTTలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని నిర్మాత రాధిక వెల్లడించారు.
