
Varanasi: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. టైమ్ ట్రావెల్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న రాజమౌళి.. కేవలం దర్శకత్వంలోనే కాకుండా సినిమా ప్రమోషన్స్‌లోనూ తనదైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటికే ప్రమోషన్స్‌ను ప్రారంభించారు జక్కన్న. హాలీవుడ్ మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ‘వారణాసి’కి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘వారణాసి వరల్డ్’ ఇంట్రో వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజాగా మరో ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వారణాసి నా యాంబిషియస్ ప్రాజెక్ట్. ఇది భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. అంటార్కిటికా, ఆఫ్రికాలోనూ షూటింగ్ చేశాం. ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న సినిమా. కథ రామాయణ కాలంలోకి కూడా ప్రయాణిస్తుంది. సినిమాలో తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్ కీలకంగా ఉంటుంది. అదే సమయంలో ప్రేక్షకులను అబ్బురపరిచే భారీ విజువల్స్ ఉంటాయి’’ అని రాజమౌళి తెలిపారు. రాజమౌళి కామెంట్స్‌తో ‘వారణాసి’పై మరింత ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా రుద్ర పాత్రలో మహేశ్‌బాబు ఎలా కనిపించబోతున్నారు? ఆయన పాత్రకు సంబంధించిన యాక్షన్, విజువల్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయి? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఒకవైపు సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తూనే.. మరోవైపు సరైన సమయంలో ఒక్కో అప్‌డేట్ ఇస్తూ అంచనాలను మరింత పెంచుతున్నారు రాజమౌళి. దీంతో ‘వారణాసి’ కేవలం సినిమా మాత్రమే కాదు.. దాని ప్రమోషన్ కూడా ఓ ప్రత్యేకమైన స్ట్రాటజీతో సాగుతోందంటూ అభిమానులు, సినీ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.
