
Venky Atluri: టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి మరోసారి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ధనుష్ కోసం ఒక కొత్త కథను రెడీ చేయనున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ధనుష్ సర్‌కి ఓ స్టోరీ ఐడియా వినిపించానని చెప్పారు. ఈసారి పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ కథ తనకు పూర్తిగా తెలిసిన జానర్ కాకపోవడంతో ప్రస్తుతం విస్తృతంగా రీసెర్చ్ చేస్తున్నానని వెంకీ అట్లూరి పేర్కొన్నారు. “ధనుష్ గారు కేవలం నటుడే కాదు.. మంచి రచయిత, దర్శకుడు కూడా. అందుకే ఆయనతో సినిమా చేసే విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో హోమ్‌వర్క్ చేస్తున్నాను” అని వెల్లడించారు. ఇప్పటికే వెంకీ అట్లూరి-ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన సార్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈక్రమంలో మళ్లీ వీళ్లిద్దరూ కొత్త సినిమా కోసం చేతులు కలపబోతున్నారని తెలియడంతో ఈ చిత్రంపై అప్పుడే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
