Site icon TeluguMirchi.com

Venky Atluri: ‘రంగ్ దే’ తర్వాత మారిపోయా.. అసలు నిజం చెప్పిన వెంకీ అట్లూరి!

VenkyAtluri

Venky Atluri: డైరెక్టర్ వెంకీ అట్లూరి తన సినిమాల ఎంపిక విషయంలో తీసుకున్న కీలక నిర్ణయం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ మూడు చిత్రాల తర్వాత తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకున్నానని, అప్పటి నుంచి ప్రతి సినిమా ఒకదానికొకటి భిన్నంగా ఉండేలా ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రంగ్ దే’ సినిమా తర్వాత తాను కొత్త తరహా కథలను చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఫస్ట్ మూడు సినిమాలు ఒకే తరహా గ్రాఫ్‌లో సాగాయని, అందుకే సోషల్ మీడియాలో తనపై తీవ్ర ట్రోలింగ్ జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఆ విమర్శలే తనను కొత్తగా ఆలోచించేలా చేశాయని అన్నారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో దొరికిన సమయాన్ని తన సినీ ప్రయాణాన్ని విశ్లేషించుకోవడానికి ఉపయోగించుకున్నానని వెంకీ అట్లూరి తెలిపారు. అప్పుడే ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ఆ ఆలోచన ఫలితమే ‘లక్కీ భాస్కర్’ అని చెప్పారు. ఆ సినిమా తర్వాత పూర్తిగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలనే ఆలోచనతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథను ఎంచుకున్నట్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో యాక్షన్, హింసాత్మక కథలతో కూడిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని వెంకీ అట్లూరి అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్లుగా ప్రేక్షకులు అలాంటి చిత్రాలనే ఎక్కువగా చూస్తున్నారని, అందుకే కుటుంబ సభ్యులంతా కలిసి థియేటర్‌కు వచ్చి ఆస్వాదించేలా ఆహ్లాదకరమైన సినిమాను అందించాలని భావించానని చెప్పారు. తన కొత్త చిత్రం ప్రేక్షకులకు వినోదంతో పాటు కుటుంబ బంధాల విలువను గుర్తు చేసేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ కామెంట్స్‌తో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Exit mobile version