Vijay Antony: విజయ్ ఆంటోని (Vijay Antony) హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భద్రకాళి’ (Bhadrakali). ఇది ఆయన కెరీర్‌లో 25వ మూవీ కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంలో ‘శక్తి తరుమగన్’ (Shakti Tharumagan)గా తెరకెక్కుతుండగా, తెలుగులో ‘భద్రకాళి’ పేరుతో విడుదల కానుంది.
తెలుగులో ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా, మొదట సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుందని టీమ్ ప్రకటించింది. అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని విజయ్ ఆంటోని స్వయంగా తన సోషల్ మీడియా ఎక్స్ (X) అకౌంట్ ద్వారా ప్రకటించారు.
“ప్రియమైన మిత్రులారా, మా సినిమాను వాయిదా వేస్తున్నందుకు క్షమించండి. కొత్త రిలీజ్ డేట్ — సెప్టెంబర్ 19. ఆ రోజున థియేటర్లలో కలుద్దాం” అంటూ ఆయన పోస్ట్ చేశారు.
రాజకీయ నేపథ్యంలో సాగే ఈ కథ, రూ. 190 కోట్ల భారీ కుంభకోణం చుట్టూ తిరుగుతుంది. ఇందులో వాగై చంద్రశేఖరం, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, మాస్టర్ కేశవ్, తృప్తి రవీంద్ర వంటి కళాకారులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

