Site icon TeluguMirchi.com

Vijay Deverakonda: మాట నిలబెట్టుకున్న దేవరకొండ దంపతులు.. 44 స్కూళ్ల పిల్లలకు పెళ్లి కానుకగా మెరిట్ స్కాలర్‌షిప్స్!

Vijay Deverakonda

Vijay Deverakonda: ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ఉదారతను చాటుకున్నారు. పెళ్లి పీటలపై తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ శనివారం తెలంగాణలో ‘ది దేవరకొండ ఫౌండేషన్’ (The Deverakonda Foundation) తరఫున ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందజేసి, పిల్లల భవిష్యత్తుకు భరోసానిచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని తుమ్మన్‌పేట గ్రామం విజయ్ దేవరకొండ కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది తన తండ్రి స్వగ్రామం కావడంతో ఆ ఊరిపై ఆయనకు చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఫిబ్రవరిలో ప్రకటించిన ఆ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తూ, తుమ్మన్‌పేట గ్రామానికి విచ్చేసిన ఈ స్టార్ కపుల్.. మొదటి విడత మెరిట్ స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. అచ్చంపేట మండలం పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతుల్లో మొదటి, ద్వితీయ ర్యాంకులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లను అందజేసి వారిని సత్కరించారు. ఇందులో భాగంగా జెడ్‌పీహెచ్ఎస్ అచ్చంపేట, టీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు అందుకున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో ఈ జంట వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుక ముగిసిన వెంటనే సమాజానికి ఉపయోగపడేలా ఒక మంచి కార్యాన్ని చేస్తామని ఈ దంపతులు ప్రతిజ్ఞ చేశారు. తాజా కార్యక్రమంతో తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అంతేకాదు, ఈ సేవా కార్యక్రమాలను కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా.. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు విస్తరిస్తామని విజయ్ దేవరకొండ ఈ వేదికపై తన కలని పంచుకున్నారు. ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “చదువుల్లో నేనూ, రష్మిక ఎప్పుడూ టాప్ ర్యాంకర్లం కాదు. మార్కులు, పర్‌ఫెక్షన్ కంటే.. కష్టపడి పని చేసే గుణమే ముఖ్యం” అంటూ ప్రభుత్వ పాఠశాలల్లో కఠిన పరిస్థితుల మధ్య చదువుకుంటున్న విద్యార్థులలో కొండంత ధైర్యాన్ని నింపారు. పెళ్లి తర్వాత లగ్జరీ ట్రిప్పులకు వెళ్లకుండా, ఇలా మారుమూల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల పిల్లల చదువుల కోసం ముందుకొచ్చిన ఈ కపుల్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Exit mobile version