Site icon TeluguMirchi.com

Vishwak Sen: ‘లెగసీ’ ఫైనల్ షెడ్యూల్‌కి ఎంట్రీ.. డిసెంబర్‌లో విశ్వక్ సేన్ మాస్ జాతర!

Vishwak Sen

Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘లెగసీ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ‘పిండం’ ఫేమ్ సాయికిరణ్ రెడ్డి దైదా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కలాహీ మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయికిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ‘లెగసీ’కి సంబంధించిన చివరి షెడ్యూల్ మదనపల్లె, చిత్తూరు జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. దాదాపు నెల రోజుల పాటు ఈ షూటింగ్ కొనసాగనుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలతో పాటు హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎపిసోడ్లు, పాటలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్‌తో పాటు ప్రధాన తారాగణం ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

రాజకీయ నేపథ్యంతో సాగే ఈ కథలో అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు సమాచారం. తన తండ్రి గతానికి సంబంధించిన పరిణామాల కారణంగా ఓ వారసుడు తాను ఎప్పుడూ అడుగుపెట్టకూడదనుకున్న ప్రమాదకరమైన ప్రపంచంలోకి వెళ్లాల్సి వస్తుందని తెలుస్తోంది. దాచిన నిజాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో.. కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలా? లేక దానికి కొత్త అర్థం చెప్పాలా? అనే సంఘర్షణ కథలో కీలకంగా ఉండనుంది. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఇప్పటివరకు చూడని భిన్నమైన, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించనున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు కేకే మేనన్ పవర్‌ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య సాగే సంఘర్షణ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. మురళీ మోహన్, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, ఏక్తా రాథోడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లెగసీ’ అనౌన్స్‌మెంట్ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. కలాహీ మీడియా నిర్మిస్తున్న రెండో చిత్రంగా ‘లెగసీ’పై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించి డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

Exit mobile version