
Movie Interval: థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నప్పుడు సరిగ్గా కథ కీలక మలుపు తిరిగే సమయానికి తెరపై ‘ఇంటర్వెల్’ కార్డు పడుతుంది. ప్రేక్షకుల్లో ఉత్కంఠను పీక్స్‌కు తీసుకెళ్లి, సెకండ్ హాఫ్‌పై అంచనాలు పెంచడానికే డైరెక్టర్స్ ఈ విరామాన్ని ప్లాన్ చేస్తారని అందరూ భావిస్తుంటారు. కానీ వాస్తవానికి ఈ ‘ఇంటర్వెల్’ సంస్కృతి కథల కోసమో లేదా దర్శకుల సస్పెన్స్ కోసమో పుట్టలేదట. సినిమా ప్రదర్శనలో ఎదురైన సాంకేతిక ఇబ్బందులను కప్పిపుచ్చుకోవడానికి మొదలైన ఒక తాత్కాలిక సర్దుబాటే, కాలక్రమంలో భారతీయ సినిమాకు ట్రేడ్‌మార్క్‌గా మారిపోయింది.
ఒకప్పుడు ఇప్పుడున్నట్లు డిజిటల్ ప్రొజెక్షన్లు, క్యూబ్ టెక్నాలజీలు లేవు. అప్పట్లో భారీ రీళ్లను ప్రొజెక్టర్‌లో పెట్టి సినిమాను ప్రదర్శించేవారు. ఎక్కడో కొన్ని టెంట్ హాల్స్‌లో ఒకే ప్రొజెక్టర్ ఉండటంతో ప్రతి రీలు మార్చడానికి కాస్త సమయం పట్టేది. అయితే చాలా థియేటర్లలో డ్యూయల్ ప్రొజెక్టర్ల సదుపాయం ఉండటంతో పెద్దగా సమయం వృథా కాకుండానే రీళ్లను మార్చేవారు. అయితే, అప్పట్లో సినిమాలు కనీసం మూడు గంటలకు పైగా సుదీర్ఘ నిడివితో ఉండేవి. అంతసేపు ఒకేచోట కూర్చోవడం ప్రేక్షకులకు భారంగా మారడంతో పాటు, ప్రదర్శన వ్యవస్థలో భాగంగా ఒక రీల్ పూర్తయ్యాక మరో పెద్ద రీల్‌ను సెట్ చేయడానికి దాదాపు 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ అవసరమయ్యేది. ఆ సాంకేతిక విరామాన్ని ప్రేక్షకులు బోరింగ్‌గా భావించకుండా ఉండటానికే ‘ఇంటర్వెల్’ పేరుతో బ్రేక్ ఇవ్వడం ప్రారంభించారు.
కాలం మారింది. భారీ రీళ్ల స్థానంలో శాటిలైట్, డిజిటల్ ప్రొజెక్షన్లు వచ్చేశాయి. ఇప్పుడు రీళ్లు మార్చే పనే లేదు, క్షణాల్లో సినిమా నిరంతరాయంగా నడిచిపోతుంది. హాలీవుడ్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇంటర్వెల్ కాన్సెప్ట్‌ను ఎప్పుడో పక్కనపెట్టేశారు. కానీ ఇండియాలో మాత్రం ఇప్పటికీ ఈ బ్రేక్ కొనసాగుతూనే ఉంది. సాంకేతిక సమస్యల కోసం పుట్టిన ఈ బ్రేక్.. క్రమంగా భారతీయ ప్రేక్షకుల జీవనశైలిలో, సినిమా చూసే అనుభవంలో విడదీయరాని భాగంగా పాతుకుపోయింది. సమోసాలు, పాప్‌కార్న్ అమ్మకాలతో థియేటర్ యాజమాన్యాలకు భారీ వ్యాపారంగా మారడమే కాకుండా, సినిమా కథల్లో సరిగ్గా ఇంటర్వెల్ బ్యాంగ్ పడకపోతే ప్రేక్షకులు పెదవి విరిచే స్థాయికి ఈ ఇంటర్వెల్ సంస్కృతి చేరుకుంది. సాంకేతిక అవసరం పోయినా, ఆ సంప్రదాయం మాత్రం ఇప్పటికీ వెండితెరను ఏలుతూనే ఉంది.
