Site icon TeluguMirchi.com

Yash: యశ్‌కు రెమ్యునరేషన్ వద్దట.. ‘రామాయణ’ కోసం సౌత్ మొత్తం రైట్స్‌పై కన్ను!

Yash

Yash: బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రామాయణ’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యశ్ రెమ్యునరేషన్‌పై ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తాజా సోషల్ మీడియా నివేదికల ప్రకారం.. ‘రామాయణ: పార్ట్ 1’లో నటించినందుకు యశ్ సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్‌ను తీసుకోకుండా, దానికి బదులుగా సౌత్ ఇండియా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను తీసుకునే డీల్‌పై ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మార్కెట్లలో ఈ సినిమా విడుదల ద్వారా వచ్చే వ్యాపారంలో యశ్ నేరుగా భాగస్వామి అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ డీల్‌పై ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఒకవేళ ఈ డీల్ నిజమైతే యశ్‌కు ఇది చాలా కీలకమైన బిజినెస్ మూవ్‌గా మారనుందని చర్చించుకుంటున్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దక్షిణాదితో పాటు దేశవ్యాప్తంగా భారీ మార్కెట్‌ను సంపాదించుకున్న యశ్.. ఇప్పుడు నటుడిగానే కాకుండా నిర్మాతగా, డిస్ట్రిబ్యూషన్‌లోనూ తన పరిధిని విస్తరించే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

యశ్‌కు చెందిన ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’ ఇప్పటికే ‘రామాయణ’ నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. ఈ నేపథ్యంలో సౌత్ థియేట్రికల్ రైట్స్‌ను కూడా అదే సంస్థ ద్వారా హ్యాండిల్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అవసరాన్ని బట్టి వివిధ ప్రాంతాల్లో సబ్-డిస్ట్రిబ్యూటర్లతో కలిసి సినిమాను రిలీజ్ చేసే విధంగా ప్లాన్ ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ‘రామాయణ’కు ఇప్పటికే భారీ స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ జరుగుతున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ ఇండియా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను సుమారు రూ.250 కోట్లకు దక్కించుకున్నట్లు గతంలో పలు వార్తలు వచ్చాయి. అలాగే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కోసం దిల్ రాజు సుమారు రూ.105 కోట్ల డీల్‌పై చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల రిపోర్టులు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో యశ్ తన రెమ్యునరేషన్‌ను నేరుగా డబ్బులు తీసుకోకుండా సౌత్ థియేట్రికల్ మార్కెట్‌లో వాటా తీసుకుంటే.. సినిమా సక్సెస్‌తో అతనికి భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో ‘రామాయణ’ బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్‌లో నేరుగా భాగస్వామి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా యశ్ రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఈ కొత్త డీల్ నిజమేనా? సౌత్ ఇండియా థియేట్రికల్ రైట్స్‌ను ఆయన సంస్థే హ్యాండిల్ చేయబోతోందా? అనేది అధికారిక ప్రకటన వస్తేనే స్పష్టత రానుంది.

Exit mobile version