
Yash: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్‌కు కొంతమంది నుంచి విమర్శలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా సినిమాలో మహిళలను అభ్యంతరకరంగా చూపించారని, అశ్లీలతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, పురుషాధిక్యతను ప్రోత్సహించేలా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా యశ్ ఈ విమర్శలపై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తాను అశ్లీలతను ఎప్పుడూ ప్రోత్సహించనని స్పష్టం చేశారు. సినిమాల్లో సన్నిహిత సన్నివేశాలు ఉన్నప్పటికీ వాటికంటూ కొన్ని హద్దులు ఉంటాయని పేర్కొన్నారు. అలాంటి సన్నివేశాలను కూడా కళాత్మకంగా తెరకెక్కించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
సినిమాను చూసిన తర్వాత ప్రేక్షకులకు కలిగే భావన, అనుభూతే దాని అసలు ప్రభావాన్ని నిర్ణయిస్తుందని యశ్ అన్నారు. ‘టాక్సిక్’లో కేవలం యాక్షన్ లేదా డ్రగ్స్ మాఫియాను మాత్రమే చూపించలేదని, యువత ఆలోచనలు, వారి సమస్యలు, తల్లిదండ్రులతో ఉన్న సంఘర్షణలు వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. యువత ఎందుకు పాత నిబంధనలకు కట్టుబడి ఉండాలి? వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? పెద్దలతో వారికి ఎదురయ్యే సమస్యలు ఏమిటి? వంటి ప్రశ్నలను సినిమాలో చర్చించినట్లు యశ్ వెల్లడించారు. ఈ కథలో భావోద్వేగాలు చాలా కీలకంగా ఉంటాయని, సినిమా పూర్తిగా చూసిన తర్వాత ఇది యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కథ అని ప్రేక్షకులకే అర్థమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీ తర్వాత యశ్ నటిస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో యశ్ డబుల్ యాక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది
