Site icon TeluguMirchi.com

Toxic: ఆగస్ట్‌లో రాకింగ్ స్టార్ ‘టాక్సిక్’! రేపే అఫీషియల్ అనౌన్స్‌మెంట్?

Toxic

Toxic: కేజీఎఫ్ సిరీస్‌తో గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’ (Toxic: A Fairy Tale for Grown-ups). గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ అప్‌డేట్ తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని 2026 ఆగస్ట్‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు (సోమవారం) రానున్నట్లు తెలుస్తోంది.

నిజానికి గత కొన్ని రోజులుగా ‘టాక్సిక్’ సినిమా రిలీజ్ వాయిదాల పర్వంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు. ముందుగా ఈ సినిమా మార్చిలో, ఆ తర్వాత జూన్ 4న విడుదల కావాల్సిన పలు కారణాల వల్ల ఆగిపోయింది. అయితే తాజాగా ‘టాక్సిక్’ అఫీషియల్ హ్యాండిల్ నుంచి “Got plans for tomorrow?” (రేపటికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా?) అంటూ ఒక సర్ప్రైజ్ పోస్ట్ వచ్చింది. దీనితో యశ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. రేపు రాబోయే అప్‌డేట్ కచ్చితంగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ గురించేనని, అది కూడా ఆగస్ట్ నెలను లాక్ చేస్తూ అనౌన్స్‌మెంట్ ఉంటుందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ.800 – రూ. 850 కోట్ల భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయని సమాచారం. ఈ సినిమాలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు.

1940 – 1970 మధ్య కాలంలో గోవా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే డ్రగ్ కార్టెల్, గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దీనికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా, గ్లోబల్ స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రేపు రాబోయే అధికారిక ప్రకటనతో విడుదల తేదిపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడే అవకాశం ఉందని అంటున్నారు.

Exit mobile version