
Yash Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, ప్రముఖ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నుంచి వస్తున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు అభిమానుల్లో ఆసక్తిని పెంచగా.. అదే సమయంలో కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో చర్చలు, విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా యశ్ లుక్, సినిమా విజువల్స్, కథా నేపథ్యంపై అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
తాజాగా ‘టాక్సిక్’ చిత్ర బృందం అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా అధికారిక ట్రైలర్‌ను ఆగస్టు 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో యశ్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ట్రైలర్ ద్వారా యశ్ పాత్ర ఎలా ఉండబోతుంది? గీతు మోహన్‌దాస్ తెరకెక్కించిన ప్రపంచం ఏ స్థాయిలో ఉండనుంది? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. యశ్ కెరీర్‌లో మరో భారీ చిత్రంగా నిలవనున్న ‘టాక్సిక్’పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
