Site icon TeluguMirchi.com

రాజ్ అల్లాడకు NATS అధ్యక్ష బాధ్యతలు.. కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎంపిక!

Nats raj allada
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (NATS) 2026–2028 కాలానికి నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. సంస్థను మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తూ, సేవా కార్యక్రమాలను విస్తరించి, సభ్యులతో అనుబంధాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాజ్ అల్లాడను అధ్యక్షుడిగా NATS బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్నుకుంది. అనుభవం, యువ నాయకత్వం, సేవా దృక్పథం కలగలిసిన ఈ కొత్త కార్యవర్గంలో రాజేష్ కండ్రు (వైస్ ప్రెసిడెంట్ – ప్రోగ్రామ్స్), అనుదీప్ అర్లా (వైస్ ప్రెసిడెంట్ – ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్), రాజ్యలక్ష్మి చిలుకూరి (వైస్ ప్రెసిడెంట్ – సర్వీసెస్), సుధీర్ మిక్కిలినేని (కార్యదర్శి), రామ్ నరేష్ కొమ్మనబోయిన (ఖజాంచీ), భాను లంక (జాయింట్ సెక్రటరీ), వెంకట సాకమూరి (జాయింట్ ట్రెజరర్) బాధ్యతలు చేపట్టనున్నారు.

న్యూజెర్సీకి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ రాజ్ అల్లాడ 2009 నుంచి NATSలో వాలంటీర్‌గా సేవలందిస్తూ సంస్థ అభివృద్ధికి కీలకంగా పనిచేస్తున్నారు. పలు బాధ్యతలు నిర్వహించడంతో పాటు బోర్డ్ సభ్యుడిగా కూడా సేవలందించిన ఆయన, ముఖ్యంగా సేవా కార్యక్రమాల పట్ల చూపిన నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు పొందారు. 2023లో డిప్యూటీ కన్వీనర్‌గా వ్యవహరించిన రాజ్ అల్లాడ, న్యూజెర్సీలో నిర్వహించిన NATS సంబరాలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. నిధుల సేకరణ, వాలంటీర్ల సమన్వయం, సేవా కార్యక్రమాల అమలులో ఆయన చూపిన నాయకత్వం సభ్యుల ప్రశంసలు అందుకుంది.

దాదాపు రెండు దశాబ్దాలుగా సంస్థకు అందిస్తున్న సేవలు, నాయకత్వ సామర్థ్యాన్ని గుర్తించిన NATS ఇప్పుడు ఆయనకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఎంపిక కమిటీ సిఫార్సులు, వివిధ అంశాలపై సమగ్ర పరిశీలన అనంతరం NATS బోర్డ్ ఈ కార్యవర్గాన్ని ఎంపిక చేసింది. ఈ సందర్భంగా బోర్డ్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల నూతన అధ్యక్షుడు రాజ్ అల్లాడతో పాటు మొత్తం కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ, సేవా దృక్పథం మరియు స్పష్టమైన లక్ష్యాలతో ఈ బృందం సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 2026–2028 కాలంలో NATS మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచుతుందనే నమ్మకాన్ని సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version