
Lenin: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా ఓటీటీలో సత్తా చాటుతోంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. తాజాగా ‘లెనిన్’ కేవలం వారం రోజుల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఓటీటీలో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘లెనిన్’ చిత్రానికి మురళీకృష్ణ దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో అక్కినేని అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రేమ, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో పాటు యాక్షన్ అంశాలను మేళవించారు.
‘లెనిన్’ కథేంటంటే..
అనాథ అయిన లెనిన్ (అఖిల్) అనుకోకుండా చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ జరిగే ఓ జాతర సందర్భంగా ఆ ఊరి పెద్ద కుటుంబానికి దగ్గరవుతాడు. క్రమంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ఆప్తుడిగా మారతాడు. ఈ క్రమంలో జాతరలోనే భారతి (భాగ్యశ్రీ బోర్సే)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే లెనిన్‌ను పెంచి పెద్ద చేసిన కుటుంబానికి చెందిన వసంత్.. భారతిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ తనకు ఆ పెళ్లి ఇష్టం లేదని, లెనిన్‌ను ప్రేమిస్తున్నానని భారతి స్పష్టం చేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వసంత్ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. అతని సమక్షంలోనే లెనిన్, భారతికి పెళ్లి జరుగుతుంది. అయితే పెళ్లి తర్వాత వారి జీవితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. అసలు లెనిన్ ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? భారతి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలేంటి? ఎతిరాజులు (శివాజీ) పాత్ర కథలో ఎలాంటి మలుపు తీసుకొస్తుందని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘లెనిన్’
థియేటర్లలో విడుదలైన సమయంలోనే ‘లెనిన్’పై ఆసక్తి నెలకొనగా.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌లోనూ అదే జోరును కొనసాగిస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక ZEE5లో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం కేవలం ఏడు రోజుల్లోనే 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అఖిల్ కెరీర్‌లో ‘లెనిన్’కు ఈ ఓటీటీ రెస్పాన్స్ ప్రత్యేకంగా నిలిచింది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జోడీతో పాటు గ్రామీణ నేపథ్యం, ఎమోషనల్ డ్రామా, యాక్షన్ అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. తాజాగా నమోదైన 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డుతో ‘లెనిన్’ మరోసారి వార్తల్లో నిలిచింది.
