Site icon TeluguMirchi.com

Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్స్‌గా కీర్తి సురేశ్ .. ఓటీటీలోకి ‘అక్క’ రాక ఫిక్స్!

Keerthy Suresh

Keerthy Suresh: వెండితెరపై వరుస ప్రయోగాలతో ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తున్న జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై మరో విధ్వంసానికి రెడీ అయ్యారు. ఇటీవల రిలీజ్ అయిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ‘ఏషనాగుల’ పాటతో అలరించి, ఆ వెంటనే తమిళ చిత్రం ‘డోరోతి’తో సర్‌ప్రైజ్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. నెల గడవకముందే అత్యంత బోల్డ్ అండ్ వయోలెంట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలీవుడ్ విలక్షణ నటి రాధికా ఆప్టేతో కలిసి కీర్తి స్క్రీన్ పంచుకున్న మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ వెబ్ సిరీస్ ‘అక్క’ విడుదలకు రంగం సిద్ధమైంది. సాధారణంగా గ్యాంగ్‌స్టర్ కథలంటే తుపాకులు పట్టిన పురుషుల రక్తపాతమే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ‘అక్క’ సిరీస్ ఇందుకు పూర్తి భిన్నమైన సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించనుంది. 1980ల నాటి దక్షిణ భారతదేశంలోని ‘పెర్నూరు’ అనే కల్పిత పట్టణం చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఆ ప్రాంతం పూర్తిగా మహిళా గ్యాంగ్‌స్టర్ల కనుసన్నల్లోనే ఉంటుంది. వారిదే చట్టం.. వారిదే అంతిమ తీర్పు. తమ స్వయంకృత నిబంధనలతో పెర్నూరును గుప్పిట్లో ఉంచుకున్న లేడీ గ్యాంగ్‌స్టర్ క్వీన్స్ మధ్య సాగే కథ ఇది.

ఒకే తాటిపై ఉండే ఆ మహిళల సామ్రాజ్యంలోకి బయటి వ్యక్తి ప్రవేశించడంతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారవుతుంది. అప్పటివరకు ఒకరికొకరు తోడుగా నిలిచిన వారి సోదరీభావం బద్దలై, కుర్చీ కోసం, ఆధిపత్యం కోసం అంతర్గత కుట్రలు మొదలవుతాయి. అధికారాన్ని దక్కించుకోవడానికి ఒకరిపై ఒకరు జరిపే హింసాత్మక దాడులు, రక్తపాతంతో పెర్నూరు రణరంగంగా మారుతుంది. ఈ క్రూరమైన ఆధిపత్య పోరులో తమ ఉనికిని కాపాడుకునేందుకు ఆ లేడీ డాన్లు ఎలాంటి సాహసాలు చేశారనేది సిరీస్‌లో అత్యంత రసవత్తరంగా చూపించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌ను అక్టోబరు 30 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేశ్, రాధికా ఆప్టే లాంటి టాలెంటెడ్ నటీమణులు తొలిసారి గ్యాంగ్‌స్టర్స్ అవతారమెత్తి ముఖాముఖి తలపడనుండటంతో డిజిటల్ తెరపై ‘అక్క’ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version