
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5
Agadha Review: కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అగధ’. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. సీనియర్ దర్శకుడు ఎం.ఎస్. రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేశారు. మరి ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ ఎలా ఉందో చూద్దాం.
కథేంటి?
మహిమ (ఉల్కా గుప్తా) ఓ నరబలి నుంచి చిన్నారిని కాపాడి అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అయితే ఆమె కళ్ల ముందే స్నేహితుడు బబ్లూ (వైవా రాఘవ) దారుణంగా హత్యకు గురవుతాడు. కొంతకాలం తర్వాత గర్భవతిగా ఉన్న మహిమ ఆత్మహత్య చేసుకుంటుంది. మహిమ మరణవార్త తెలుసుకున్న ఆమె అక్క మహాదేవి (కామాక్షి భాస్కర్ల) గ్రామానికి వస్తుంది. దుష్టశక్తులను, ఆత్మలను తరిమే శక్తి ఉన్న మహాదేవికి తన కుటుంబంలోనే కొన్ని అతీంద్రియ శక్తులు ప్రవేశించిన విషయం తెలుస్తుంది. మరోవైపు ఆమె చెల్లి హరిణి (జోవికా విజయ్‌కుమార్) కూడా ఆత్మబాధకు గురవుతుంది. మహిమ ఆత్మ ఇంకా భూమిపైనే ఉందని తెలుసుకున్న మహాదేవి.. ఆమె మరణానికి అసలు కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో మహిమ ప్రియుడు సింహ (శ్రవణ్ రెడ్డి) ఆత్మను రప్పించి విచారించగా.. మహిమ, సింహ, బబ్లూ కలిసి ఓ నిషేధిత ప్రాంతానికి వెళ్లారని, అక్కడ జరుగుతున్న నరబలిని అడ్డుకున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత ‘అగధ’ అనే శక్తి వారి వెంట పడినట్లు బయటపడుతుంది. అయితే సింహలో కూడా కొన్ని ఆత్మలు ఉన్నాయని తెలియడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. అసలు అగధ ఎవరు? మహిమ, సింహలు ఆ నిషేధిత ప్రాంతానికి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం జరిగింది? మహిమ ఆత్మకు విముక్తి లభిస్తుందా? తన కుటుంబాన్ని మహాదేవి కాపాడుకోగలుగుతుందా? అగధను ఆమె ఎదుర్కోగలుగుతుందా? అనేది తెరపై చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే?
క్షుద్రపూజలు, దుష్టశక్తుల నేపథ్యంలో తెరకెక్కిన ‘అగధ’పై టీజర్, ట్రైలర్ నుంచే ఆసక్తి ఏర్పడింది. ముఖ్యంగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం, కామాక్షి భాస్కర్ల కాంబినేషన్ సినిమాపై అంచనాలు పెంచింది. ఫస్ట్ హాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. మహిమ ఎక్కడికి వెళ్లింది? ఆమెకు ఏం జరిగింది? మహాదేవి గ్రామానికి ఎందుకు వచ్చింది? ఆమె కుటుంబంలో ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలతో దర్శకుడు సస్పెన్స్‌ను కొనసాగించాడు. కొన్ని సన్నివేశాలు భయపెట్టేలా ఉన్నాయి. ఇంటర్వెల్‌కు ‘అగధ’ ఎవరు? మహాదేవికి ఎదురుగా ఉన్న శక్తి ఏంటి? అనే ప్రశ్నలను రేకెత్తించే ట్విస్ట్‌తో సెకండ్ హాఫ్‌పై ఆసక్తి పెంచారు. సెకండ్ హాఫ్‌లో మహిమ, సింహల ఫ్లాష్‌బ్యాక్, అగధ గురించి మహాదేవి తెలుసుకునే ప్రయత్నాలు, కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఆమె చేసే పోరాటం ఆసక్తికరంగా సాగుతాయి. క్లైమాక్స్‌లో టైమ్ లూప్, మల్టీవర్స్ తరహా పాయింట్‌ను తీసుకురావడం కొత్తగా అనిపిస్తుంది.
అయితే కథలో కొన్ని అంశాలకు సరైన వివరణ ఇవ్వకపోవడం మైనస్‌గా మారింది. అగధను పూజించే వ్యక్తులు ఎవరు? నరబలులు ఎందుకు ఇస్తున్నారు? వారి నేపథ్యం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానాలు పూర్తిగా ఇవ్వలేదు. అలాగే మహాదేవి దగ్గరకు వచ్చే మానస, సంజయ్ పాత్రలు ఎందుకు వచ్చారనే విషయంలోనూ స్పష్టత కనిపించదు. కొన్ని ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను పదే పదే చూపించడం, కాకుల సన్నివేశాలు ఎక్కువగా ఉండటం, కొన్ని సీన్లలో స్క్రీన్‌ప్లే కన్ఫ్యూజ్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది. సింహ పాత్రలోని ఓ సీన్‌కు కూడా సరైన వివరణ కనిపించదు. ఇలా కొన్ని ప్రశ్నలను అలాగే వదిలేసి సినిమాను ముగించారు. పార్ట్ 2ను అధికారికంగా ప్రకటించకపోయినా కథలో ఇచ్చిన లీడ్‌లను బట్టి భవిష్యత్తులో దీనికి కొనసాగింపు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉండొచ్చని దర్శకుడు ఎం.ఎస్. రాజు గతంలో ప్రమోషన్స్‌లో వెల్లడించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్
మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల సినిమాను తన భుజాలపై మోసింది. సీరియస్, పవర్‌ఫుల్ పాత్రలో ఆమె పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. మహిమగా ఉల్కా గుప్తా కూడా మంచి నటన కనబరిచింది. సింహ పాత్రలో శ్రవణ్ రెడ్డి విభిన్న వేరియేషన్స్‌లో కనిపిస్తూ మెప్పించాడు. నెగిటివ్ షేడ్స్‌లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. జోవికా విజయ్‌కుమార్‌కు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆత్మ ఆవహించిన పాత్రలో సైకో తరహా బాడీ లాంగ్వేజ్‌తో బాగా నటించింది. సీనియర్ నటులు భాను చందర్, షిజు తమ పాత్రలకు న్యాయం చేశారు. వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, ఆర్నా మూలే, కనకవ్వ, వైవా రాఘవ తదితరులు కూడా తమ పరిధిలో మెప్పించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా చీకటి వాతావరణం, హారర్ సన్నివేశాలను కెమెరాతో చక్కగా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. చాలా సన్నివేశాలను బీజీఎం మరింత ఎలివేట్ చేసింది. ఆత్మలు, దుష్టశక్తులు, వాటిని ఎదుర్కొనే దైవశక్తి అనే పాయింట్ రొటీన్‌గానే ఉన్నప్పటికీ దర్శకుడు కొత్త కథనం, సస్పెన్స్, ట్విస్టులతో సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.
చివరిగా..
‘అగధ’ పూర్తిస్థాయి హారర్ సినిమా కంటే సస్పెన్స్, మిస్టరీ, దైవశక్తి అంశాలతో కూడిన డివైన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. నెమ్మదైన నేరేషన్, కొన్ని అనవసరమైన సన్నివేశాలు, క్లారిటీ లేని ప్రశ్నలు ఇబ్బంది పెట్టినా.. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను మాత్రం దర్శకుడు కొనసాగించాడు. కొత్త తరహా క్లైమాక్స్ కూడా సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. మొత్తంగా.. కాసేపు సస్పెన్స్, థ్రిల్, హారర్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ‘అగధ’ ఓకే అనిపిస్తుంది.
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5
