
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
తెలుగు ప్రేక్షకులకు హారర్ చిత్రాలంటే ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఆ కోవలో మంచి కంటెంట్‌తో వచ్చిన తాజా హారర్ థ్రిల్లర్ చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. టైటిల్ చూడగానే ఇదొక పొలిటికల్ మూవీ అనుకుంటే పొరపాటే, ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలు లేవు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పక్కా హారర్ థ్రిల్లర్, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ : ఈశ్వర్ (శివ కంఠమనేని) ఒక సస్పెండ్ అయిన సీఐ. అతని భార్య భానుమతి (ధన్య బాలకృష్ణ). భానుమతి చెల్లెలు భార్గవి (సుప్రీత) ఒక యూట్యూబర్. ‘దెయ్యంతో డే అండ్ నైట్’ అనే కాన్సెప్ట్‌తో పాతబస్తీలోని డెవిల్స్ హోమ్‌లో ఆమె చేసిన వీడియో వైరల్ అవ్వడంతో రాత్రికి రాత్రే సెలబ్రిటీ అవుతుంది. అప్పుడు ఆమెకు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది. దెయ్యాలు నిజంగా ఉన్నాయని లైవ్‌లో నిరూపిస్తానని చెప్పి ‘అమరావతి’ అనే గ్రామానికి రమ్మంటాడు. ఫేమస్ అవ్వాలనే ఆశతో భార్గవి తన కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్తుంది. అక్కడ ఈశ్వర్ కుటుంబానికి ఎలాంటి వింత సంఘటనలు ఎదురయ్యాయి? అమరావతి జమీందారు వారసురాలు రాజేశ్వరి(ఎస్తేర్)ని ఎవరు చంపారు? ఆమెకు ఈశ్వర్ కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఈశ్వర్ సస్పెండ్ కావడానికి కారణం ఎవరు? అనేది మిగతా కథ.
విశ్లేషణ : అమరావతి గ్రామంలో ఒక హారర్ సీన్‌తో మొదలైన కథ.. ఆ తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, అమరావతికి ప్రయాణం అవ్వడంతో సాగి, ఒక మంచి ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఇక సెకండాఫ్‌లో రాజేశ్వరి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఆమె ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. కొన్ని సన్నివేశాలు ముందుగానే ఊహించేలా (predictable) ఉండటం కథనం ప్రభావాన్ని కొంత తగ్గిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని చోట్ల నేరేషన్ నెమ్మదిగా సాగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే పాట కథ వేగానికి చిన్న స్పీడ్ బ్రేక్‌లా అనిపిస్తుంది. అలాగే కొన్ని సపోర్టింగ్ పాత్రలకు మరింత బలం ఇచ్చి ఉంటే సినిమా ఇంకా మెరుగ్గా ఉండేది. మొత్తంగా చూస్తే, మైనస్‌లు ఉన్నప్పటికీ హారర్, థ్రిల్, ఎమోషన్ మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం హారర్ లవర్స్‌ను నిరాశపరచదు.
నటీనటుల పనితీరు :
శివ కంఠమనేని: ఈశ్వర్, జగదీష్ అనే ద్విపాత్రాభినయంలో ఆయన నటన బాగుంది. విలన్ మార్క్ యాక్టింగ్‌తో పాటు, యాక్షన్ సీన్స్‌లో తన మార్క్ చూపించారు.
ఎస్తేర్: ఈ సినిమాకు ప్రధాన బలం రాజేశ్వరిగా ఎస్తేర్ నటన. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో చాలా సెటిల్డ్‌గా సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ధన్య బాలకృష్ణ & సుప్రీత: భానుమతిగా ధన్య సినిమా ఆద్యంతం మెప్పిస్తే, యూట్యూబర్ భార్గవిగా సుప్రీత తన తొలి సినిమాలోనే చక్కటి ఎమోషన్స్ పండించింది.
ఇతరులు: మహేశ్ పాత్రలో హరీష్ నటన బాగుంది. డాక్టర్ అమ్మిరాజుగా జెమినీ సురేష్, లాయర్ కామేష్‌గా భద్రమ్, జమీందారుగా అశోక్ కుమార్, నాగేంద్ర తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
ఫైనల్ గా : ‘అమరావతికి ఆహ్వానం’ ఒక డీసెంట్ హారర్ థ్రిల్లర్. మీరు హారర్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారైతే, థియేటర్లో ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా మెప్పిస్తుంది.
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
