
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
అనుష్క చాలాకాలం తర్వాత మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఘాటి. సెన్సిబుల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, జగపతి బాబు, చైతన్య రావు, రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రలు పోషించారు. తూర్పు ఘాట్స్ నేపథ్యంలో, గంజాయి సాగు మరియు అక్రమ రవాణా నేపథ్యంగా ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో అనుష్కకు జోడీగా తమిళ నటుడు విక్రం ప్రభు నటించాడు. చాలాకాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం, ఎట్టకేలకు నేడు థియేటర్లలో విడుదలైంది. పూర్తి రివ్యూ లోకి వెళ్తే …
ఆంధ్ర–ఒడిశా సరిహద్దు నేపథ్యంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ జీవించే గ్రామాల మధ్య జరిగే కథ ఇది. శీలావతి (అనుష్క శెట్టి), దేశీ రాజు (విక్రమ్ ప్రభు) ఒకరినొకరు ప్రేమించుకున్న జంట. వీరు పెళ్లి చేసుకునే ముందు కొంత డబ్బు కూడబెట్టాలని నిర్ణయించుకుంటారు. శీలావతి బస్ కండక్టర్‌గా పని చేస్తుంటే, దేశీ రాజు ల్యాబ్ టెక్నీషియన్‌గా జీవనం సాగిస్తాడు. అయితే, ఈ సమయంలో గంజాయి వ్యాపారంలో కుందల నాయుడు (చైతన్య రావు), కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్) అనే ఇద్దరు పెద్దమనుషులు, “శీలావతి” అనే ప్రత్యేకమైన గంజాయి విత్తనంతో తయారవుతున్న లిక్విడ్ కెనాబిస్ మార్కెట్లోకి వస్తుందని తెలుసుకుంటారు. ఈ కొత్త లిక్విడ్ కెనాబిస్‌ను పశ్చిమ కనుమల్లోని ఒక అజ్ఞాత గ్యాంగ్ తయారు చేస్తుందని తెలిసి వారిలో అనుమానం పెరుగుతుంది. చివరికి కుందల నాయుడు ఆ గ్యాంగ్ లీడర్ దేశీ రాజు అనే విషయం బయటపెడతాడు. ఒక సాధారణ ల్యాబ్ టెక్నీషియన్ అయిన దేశీ రాజు, శీలావతి, మరికొందరితో కలిసి గంజాయి వ్యాపారంలోకి ఎందుకు అడుగుపెట్టారు? దేశీ రాజు, శీలావతి వెనుక దాగి ఉన్న అసలు కథ ఏమిటి? పశ్చిమ కనుమల గంజాయి ఎకోసిస్టంలో ఘాటీల పాత్ర ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం ఈ సినిమా మిగతా కథగా కొనసాగుతుంది.
పుష్ప తరహా సినిమాలతో పోలిస్తే, ఘాటీలో కథనం భిన్నంగా ఉంటుంది. అక్కడ స్మగ్లింగ్‌ని గ్లోరిఫై చేస్తే, ఇక్కడ స్మగ్లింగ్ వల్ల సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను చూపించారు. అనుష్క పోషించిన శీలావతి పాత్రలో భావోద్వేగం, యాక్షన్ రెండూ బలంగా నడిపించాయి. ఫస్ట్ హాఫ్ బలంగా ఎంగేజ్ చేస్తుంది, పాత్రల పరిచయం, కథనంలో ఉన్న టెన్షన్ బాగా వర్కౌట్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సరిగా సెట్ కాకపోవడం వల్ల కొంత డిసప్పాయింట్‌మెంట్ కలిగిస్తుంది. అయినా కూడా క్రిష్ టేకింగ్, అనుష్క పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను లిఫ్ట్ చేశాయి.
నటీనటుల విషయానికి వస్తే, ఈ సినిమా పూర్తిగా అనుష్క వన్ ఉమెన్ షో. డైలాగ్స్‌తో పాటు ఫైట్స్‌లో కూడా అదరగొట్టింది. విక్రమ్ ప్రభు తన పాత్రలో బాగా న్యాయం చేశాడు. జగపతి బాబు ఎప్పటిలాగే తనదైన స్టైల్‌లో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. చైతన్య రావు, రవీంద్ర విజయ్ తమ పాత్రలలో సరైన ప్రెజెన్స్ చూపించారు. టెక్నికల్ వైపు చూస్తే, క్రిష్ ఈసారి కొంత కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించినా, తన స్టైల్ ఆఫ్ నేరేషన్ కొనసాగించాడు. సాగర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి బలంగా వర్కౌట్ అయ్యింది. సినిమాటోగ్రఫీ విజువల్స్ అద్భుతంగా తీశారు. ఎడిటింగ్ మరింత కట్టుదిట్టంగా చేసి ఉంటే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ విలువలు మాత్రం రిచ్‌గా కనిపించాయి.
మొత్తం మీద ఘాటి అనుష్కే మోసిన సినిమా. ఫస్ట్ హాఫ్ స్ట్రాంగ్‌గా, సెకండ్ హాఫ్ కొంత బలహీనంగా అనిపించినా, అనుష్క పవర్‌పుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకి మెయిన్ హైలైట్.
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
