
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
బన్ బటర్ జామ్ – లవ్ కామెడీ ఎంటర్‌టైనర్
రాజు జయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ ప్రధాన తారలుగా నటించిన తమిళ చిత్రం ‘బన్ బటర్ జామ్’ జూలై 18న విడుదలై మంచి విజయాన్ని సాధించింది. రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేష్ సుబ్రమణియన్ నిర్మాణంలో రాఘవ్ మిర్‌దత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చార్లి, శరణ్య పొన్‌వన్నన్, దేవదర్శిన, మైకేల్ తంగదురై, విజె.పప్పు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు అదే టైటిల్‌తో శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సిహెచ్ సతీష్‌కుమార్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే పలు ప్రీమియర్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది.
కథ : చంద్రు (రాజు జయమోహన్), మధుమిత (ఆధ్య ప్రసాద్) ఇంటర్ పూర్తిచేసిన సమయంలో వారి కుటుంబాలు పాత పరిచయంతో క్లోజ్ అవుతాయి. లవ్ అయినా అరేంజ్డ్ అయినా పెళ్లిళ్లు ఎక్కువగా చెడిపోతున్నాయనే ఆలోచనతో, చంద్రు తల్లి (శరణ్య), మధుమిత తల్లి (దేవదర్శిన) తమ పిల్లలకు తెలియకుండా లవ్ & అరేంజ్డ్ రెండూ కలిపిన మ్యారేజ్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఇందుకోసం మధుమిత ఫ్యామిలీ చంద్రు పక్కింట్లోకి వస్తుంది. అయితే ఇంజనీరింగ్‌లో చేరిన చంద్రు, నందిని (భవ్య త్రిఖ)ని ప్రేమిస్తాడు; అదే సమయంలో నందినిపై చంద్రు బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ (మైకేల్ తంగదురై)కూ ఇష్టం ఉంటుంది. మరోవైపు మధుమిత మాత్రం ఆకాష్ (VJ పప్పు)ని ప్రేమిస్తుంది. చంద్రు–మధుమితలను కలపాలని తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. కానీ ఓ సమయంలో వాళ్లు తమ తమ లవర్స్‌తో కలిసి ఒకరికొకరు దొరికిపోతారు. చివరికి ఎవరు ఎవరితో కలుస్తారు? ఎవరి ప్రేమలు నిజమవుతాయి? పేరెంట్స్ ప్లాన్ సక్సెస్ అవుతుందా? అన్నది తెరపై తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ : తమిళంలో యూత్‌కు బాగా కనెక్ట్ అయిన ‘బన్ బటర్ జామ్’ ఒక లవ్ కామెడీ జానర్ సినిమా. టైటిల్ కథకు పెద్దగా సంబంధం లేకపోయినా, రియాలిటీ లవ్ స్టోరీస్ ఆధారంగా కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసి ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్‌లో చంద్రు–మధుమిత పాత్రలు, వాళ్ల తల్లుల సన్నివేశాలు బాగా నవ్విస్తాయి; ఇంటర్వెల్ వద్ద లవర్స్‌తో దొరికిపోయే ట్విస్ట్ మంచి హై ఇచ్చింది. లవ్ స్టోరీస్ అన్నీ క్యూట్‌గా రాసుకున్నప్పటికీ, బ్రేకప్ ఎమోషన్స్ కూడా అంతే నేచురల్‌గా కనిపిస్తాయి. ఫ్రెండ్షిప్ ఎమోషన్, కామెడీ ట్విస్టులు బాగున్నా, సెకండ్ హాఫ్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది, క్లైమాక్స్ మాత్రం సింపుల్‌గా అనిపిస్తుంది. జంటల కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, సూపర్ సీనియర్–మేడం ట్రాక్ మెప్పిస్తుంది. చంద్రు–శ్రీనివాస్ ఫ్రెండ్షిప్ కొన్ని సీన్స్‌లో ఓవర్‌గా అనిపించినా, గే కామెడీ డైలాగ్స్‌తో కవర్ చేశారు. గత లవ్, బ్రేకప్స్ పక్కన పెట్టి ఫ్యూచర్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనే మెసేజ్ ఇచ్చిన ఈ సినిమా, మొత్తం మీద నవ్వులు పంచుతూనే ఎమోషన్ కూడా ఫీల్ అవేలా చేసింది.
ఫైనల్లీ : మొత్తం మీద ‘బన్ బటర్ జామ్’ ఒక లవ్ కామెడీ ఎంటర్‌టైనర్. యూత్ రియాలిటీ లవ్ స్టోరీస్‌ను ఆధారంగా తీసుకొని నవ్వులు పంచుతూ, అవసరమైన చోట ఎమోషన్స్‌ను టచ్ చేస్తూ, ప్రస్తుత తరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా గా నిలుస్తుంది.
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
