Site icon TeluguMirchi.com

రివ్యూ: దండోరా | Dhandoraa Movie Review

Dhandoraa Movie Review
Dandora review

తెలుగుమిర్చి రేటింగ్ : 3/5

తెలుగు సినిమాల్లో కుల వివక్ష, పరువు హత్యల నేపథ్యంతో అనేక సినిమాలు వచ్చినప్పటికీ, “దండోరా” మాత్రం ఒక కొత్త కోణంలో ఈ అంశాన్ని ప్రశ్నిస్తుంది. శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకుడు కాగా, ‘బెదురులంక’, ‘కలర్ ఫోటో’ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించిన రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ప్రమోషన్లతో పాటు టైటిల్ సాంగ్ ద్వారా ముందే మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా, బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకుకలను ఎంతవరకు ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ 2004 నుంచి ప్రారంభమై 2019 వరకు సాగుతుంది. మెదక్ ప్రాంతానికి చెందిన తుళ్లూరు గ్రామంలో అగ్ర కులానికి చెందిన రైతు శివాజీ తన కుటుంబంతో జీవనం సాగిస్తుంటాడు. అదే ఊరికి చెందిన అణగారిన వర్గ యువకుడు రవి (రవికృష్ణ), శివాజీ కుమార్తె సుజాతను ప్రేమించడంతో గ్రామంలో కుల వివక్ష భగ్గుమంటుంది. ఈ ప్రేమ వ్యవహారం ఒక దారుణ ఘటనకు దారితీస్తుంది. కాలక్రమంలో శివాజీ మరణిస్తాడు. కుల పెద్దలు అతనిని కుల స్మశాన వాటికలో దహనం చేయనివ్వమని తీర్మానిస్తారు. ఈ పరిస్థితుల్లో ఊరి సర్పంచ్ (నవదీప్) మధ్యవర్తిత్వం చేస్తూ, నగరంలో జీవిస్తున్న శివాజీ కొడుకు విష్ణు తన భార్య వనితతో ఊరికి వస్తాడు. అంత్యక్రియల కోసం చేసే ప్రయత్నాల్లో గ్రామంలో దాచిపెట్టిన నిజాలు, రవి హత్య వెనుక ఉన్న కారణాలు, శివాజీకి – శ్రీలత (బిందు మాధవి)కు మధ్య ఉన్న సంబంధం ఒక్కొక్కటిగా బయటపడతాయి. చివరికి కుల గర్వం, నేరబోధ, న్యాయం మధ్య నడిచే సంఘర్షణే “దండోరా” కథ.

దర్శకుడు ఎంచుకున్న కోర్ పాయింట్ చాలా బలంగా ఉంటుంది. ఇప్పటివరకు పరువు హత్యల్లో బాధితుల వేదననే చూపించిన సినిమాలు ఎక్కువగా ఉంటే, ఇక్కడ ఆ హత్యలకు కారణమైన కుటుంబాలు ఎదుర్కొనే నరకయాతనను చూపించిన తీరు ప్రత్యేకంగా నిలుస్తుంది. స్మశాన వాటికల చుట్టూ జరిగే వివక్ష, గ్రామాల్లో కనిపించే అడ్డంకులను చాలా సహజంగా తెరపై చూపించారు. నాలుగు లీనియర్ స్క్రీన్‌ప్లేల్లో కథను నడిపిన విధానం ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికి వస్తే, శివాజీ ఈ సినిమాలో నటించలేదు – జీవించాడు అని చెప్పాలి. ‘మంగపతి’ పాత్రను మించిన ఇంటెన్సిటీతో ఆయన పర్ఫామెన్స్ ఉంటుంది. రవికృష్ణ పాత్ర హృదయాన్ని తాకుతుంది. నవదీప్ సర్పంచ్ పాత్రలో రిఫ్రెషింగ్‌గా కనిపిస్తాడు. బిందు మాధవి, నందు, మౌనిక రెడ్డి తమ పాత్రల్లో సహజంగా ఒదిగిపోయారు. చిన్న పాత్రల్లో కనిపించిన నటులు కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చారు. సాంకేతికంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టైటిల్ సాంగ్ సినిమాకి బలంగా నిలుస్తాయి. సినిమాటోగ్రఫీ సహజత్వాన్ని కాపాడింది. కొన్ని చోట్ల ల్యాగ్ అనిపించినా, చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను బలంగా కట్టిపడేస్తాయి.

మొత్తంగా “దండోరా” ఒక ఆలోచింపజేసే, హానెస్ట్ సోషల్ డ్రామా.

తెలుగుమిర్చి రేటింగ్ : 3/5

Exit mobile version