Site icon TeluguMirchi.com

రివ్యూ: ఎపిక్: సెమిస్టర్ 1

Epic

తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5

Epic Review: ‘బేబీ’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరోసారి తెరపై మెరిసింది. ’90s’ వెబ్ సిరీస్‌తో విశేష ఆదరణ దక్కించుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఎపిక్: సెమిస్టర్ 1’. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌పై స్టార్టింగ్ నుంచే యూత్‌లో భారీ క్రేజ్ నెలకొంది. ’90s’ నాటి మిడిల్ క్లాస్ అమాయకత్వం నేపథ్యంతో మొదలైన కథ, లండన్ వేదికగా యూత్ ఫుల్ ట్రాక్‌లోకి మారాక పూర్తిగా టర్న్ తీసుకుంటుంది. నేటి జెన్‌జీ (Gen-Z) యువతలో కనిపించే ‘నో స్ట్రింగ్స్ అటాచ్డ్’, లివిన్ రిలేషన్‌షిప్‌ల చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, బెడ్ రూమ్ సీన్లు థియేటర్స్‌లో నవ్వులు పూయించాయి.

యూకే నేపథ్యం… భావోద్వేగాల సంఘర్షణ

మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన తండ్రి (శివాజీ) అప్పులు చేసి కొడుకుని విదేశాలకు పంపడం, తీరా అక్కడికి వెళ్లాక ఆ కుర్రాడు ఎదుర్కొనే ఉద్యోగ, ఆర్థిక ఇబ్బందులను దర్శకుడు వాస్తవిక కోణంలో స్పృశించారు. హీరోయిన్ కడలి (వైష్ణవి) పరిచయంతో కథ ఆధునిక బంధాల వైపు మళ్లుతుంది. భిన్న కులాలు, భావోద్వేగాల స్పష్టత లేని ఆకర్షణ, కెరీర్ ఒత్తిడిల మధ్య నలిగే యువతరం తీరును కథలో కీలకంగా చూపించారు దర్శకుడు.

నటీనటులు, సాంకేతిక బలం

ఆనంద్ దేవరకొండ అమాయకమైన పాత్రలో న్యాచురల్‌గా కనిపించగా, వైష్ణవి చైతన్య మరోసారి కాంప్లికేటెడ్ పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపై చక్కగా కుదిరింది. శివాజీ, వాసుకి కనిపించే కొన్ని సీన్లు, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ బ్లాక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచాయి. యూకే అందాలను సినిమాటోగ్రఫీ రిచ్‌గా చూపించింది.

ఫస్టాఫ్ వరకు ఆసక్తికరంగా నడిచిన కథనం, సెకండ్ హాఫ్‌లోకి వచ్చేసరికి కాస్త నెమ్మదించిన భావన కలిగించిన యూత్‌ను మాత్రం ఆకట్టుకుంటుంది. ‘పార్ట్-2’ (సీక్వెల్) ఉంటుందనే హింట్‌ను సినిమా క్లైమాక్స్‌లో మేకర్స్ ఇచ్చారు. మొత్తంగా చెప్పాలంటే, ‘ఎపిక్: సెమిస్టర్ 1’ అనేది ఆధునిక కాలపు లివిన్ రిలేషన్స్‌ను, విదేశాల్లో స్థిరపడాలనుకునే యువత తంటాలను వినోదం, బోల్డ్‌నెస్ కలగలిపి చూపించిన ప్రయత్నం. సక్సెస్‌ఫుల్‌గా యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5

Exit mobile version