Site icon TeluguMirchi.com

రివ్యూ: హ్యాపీ జర్నీ

Cinema (2)

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Happy Journey Movie Review: మహిళా ప్రధాన ఇతివృత్తంతో, వినోదం, భావోద్వేగాల కలబోతగా దర్శకుడు అభిరామ్ నాయుడు తెరకెక్కించిన ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ‘హ్యాపీ జర్నీ’. అన్నపూర్ణమ్మ, ఆమని, ఝాన్సీ వంటి సీనియర్ తారలతో పాటు నేటితరం నటీమణులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రాన్ని గుత్తా బాలాజీ, గుండాల కౌశిక్ రెడ్డి నిర్మించారు.

కథా నేపథ్యం
వేర్వేరు జీవన శైలులు, విభిన్న ఆలోచనలు కలిగిన ఏడుగురు మహిళలు — సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), దివ్య (సునైన), నయన (జినిషా), విహాన (రూప) — లక్కీ డ్రా ద్వారా యూరప్ టూర్‌కి వెళ్లే అవకాశాన్ని గెలుచుకుంటారు. వీరి ప్రయాణాన్ని నడిపించే టూర్ గైడ్స్‌గా గోవింద్ (వంశీ), అప్పారావు (రవి శివతేజ) బాధ్యత తీసుకుంటారు. నవ్వులు, సరదాలతో మొదలైన ఈ విదేశీ యాత్ర చివరకు వారి జీవిత సత్యాలను ఎలా ఆవిష్కరించింది? కుటుంబ బంధాల విలువను ఎలా గుర్తుచేసింది? అన్నదే ఈ సినిమా కథ.

సినిమాలో మెప్పించే అంశాలు
నిత్య జీవితంలో కుటుంబ బాధ్యతలకే పరిమితమైపోయే మహిళలు తమను తాము తిరిగి ఆవిష్కరించుకునే చక్కటి పాయింట్‌ను దర్శకుడు ఎంచుకున్నారు. టైటిల్‌కు తగినట్లే సినిమా చూసే ప్రేక్షకుడికి ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుంది. వంశీ, రవి శివతేజల టైమింగ్ కామెడీ సినిమాకు ప్రధాన బలం. లేడీ గ్యాంగ్‌తో వీరి సంభాషణలు థియేటర్‌లో మంచి నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్ కథకు చక్కటి ముగింపునిచ్చింది. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మోడ్రన్ లుక్‌లో నవ్వులు పూయిస్తూనే అలరించారు. ఆమని, ఝాన్సీ తమ అనుభవంతో పాత్రలకు నిండుదనం తీసుకురాగా, పాయల్ రాధాకృష్ణ, సునైన ఎమోషనల్ సీన్లలో చక్కటి పరిణతి కనబరిచారు.

రిచ్ విజువల్స్:
సుబ్రమణ్యన్ మణిగండన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. యూరప్ అందాలను వెండితెరపై ఎంతో కలర్‌ఫుల్‌గా, రిచ్‌గా చూపించారు. శేఖర్ చంద్ర అందించిన పాటలు, నేపథ్య సంగీతం జర్నీ ఫీల్‌ను చక్కగా ఎలివేట్ చేశాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. కుటుంబ బంధాల విలువను గుర్తుచేస్తూ, ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచే చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘హ్యాపీ జర్నీ’ చక్కటి అనుభూతినిస్తుంది. ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుని, కాసేపు మనసు తేలికపరుచుకోవడానికి ఇది ఒక మంచి వీకెండ్ వాచ్.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Exit mobile version