Site icon TeluguMirchi.com

రివ్యూ : ఇరుముడి

Irumudi review

తెలుగుమిర్చి రేటింగ్ : 3.75/5

రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. అయ్యప్ప స్వామి మాల నేపథ్యంలో తండ్రి–కూతుళ్ల అనుబంధం, యాక్షన్, క్రైమ్, ఎమోషన్‌లను మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? రవితేజ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడా? సినిమా కథ, కథనం ఎలా ఉన్నాయి? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ : త్రినాథ్ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణికంఠ (బేబీ నక్షత్ర)తో కలిసి సీలేరు సమీపంలోని ఓ గ్రామంలో సంతోషంగా జీవిస్తుంటాడు. కూతురంటే ఎంతో ప్రేమించే త్రినాథ్‌కు మద్యం తాగే అలవాటు ఉంటుంది. అయితే ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేసుకున్న 41 రోజులు మాత్రం నిష్టగా మద్యానికి దూరంగా ఉంటాడు. ఊరిలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా తన కూతురికి జరిగినట్టే భావించి ఎదిరించే త్రినాథ్‌కు ఈ కారణంగా పలువురు శత్రువులు కూడా తయారవుతారు.

మణికంఠను సీలేరు హైస్కూల్‌లో చేర్పించిన తర్వాత కథలో అసలు సమస్య మొదలవుతుంది. స్కూల్‌లో ఆడపిల్లలకు ఎదురవుతున్న ఇబ్బందులు, ఓ అమ్మాయి మృతి, మరో అమ్మాయి స్కూల్ మానేయడం వంటి సంఘటనలు అనేక అనుమానాలకు దారితీస్తాయి. మణికంఠకు తెలిసిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో త్రినాథ్ ఈ వ్యవహారంలోకి అడుగుపెడతాడు. అసలు స్కూల్‌లో ఏం జరుగుతోంది? ఆడపిల్లలకు ఎదురవుతున్న సమస్యల వెనుక ఎవరు ఉన్నారు? కూతురిని కాపాడటంతో పాటు ఇతర అమ్మాయిల కోసం త్రినాథ్ ఎలాంటి పోరాటం చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

ఫస్ట్ హాఫ్ కుటుంబ నేపథ్యం, తండ్రి–కూతుళ్ల అనుబంధం, త్రినాథ్ క్యారెక్టర్, స్కూల్‌లో జరుగుతున్న సంఘటనలతో ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్‌లో యాక్షన్, ఎమోషన్ మరింత పెరుగుతాయి. ముఖ్యంగా ‘మల్లెపూల పల్లకి’ పాట తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మరింత ఎమోషనల్‌గా మారుతుంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉన్నాయి.

నటీనటుల పనితీరు

రవితేజ ఈ సినిమాలో తన నటనతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నాడు. కామెడీ, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని షేడ్స్‌లో తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా తండ్రిగా, అయ్యప్ప స్వామి భక్తుడిగా ఆయన పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. బేబీ నక్షత్ర తండ్రి–కూతురు సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. రవితేజ–నక్షత్ర కాంబినేషన్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేస్తుంది. ప్రియా భవానీ శంకర్, సాయికుమార్, స్వాసిక, అజయ్ ఘోష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం

సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్. సీలేరు, కేరళ తరహా ప్రకృతి అందాలను తెరపై అందంగా చూపించారు. అడవులు, డ్యామ్, బ్రిడ్జ్, అయ్యప్ప స్వామి ఆలయం, అరటి తోటలు వంటి లొకేషన్స్ ప్రతి ఫ్రేమ్‌కు మంచి విజువల్ ఫీల్‌ను తీసుకొచ్చాయి.

జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి పాటలు, వాటి పిక్చరైజేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు శివ నిర్వాణ కథను ఆసక్తికరమైన ఎమోషనల్ క్రైమ్ డ్రామాగా మలచడంలో సక్సెస్ అయ్యారు.

ఫైనల్ గా :

తన కూతురు, ఊరిలోని ఆడపిల్లల కోసం నిలబడే ఓ తండ్రి కథను అయ్యప్ప స్వామి మాల బ్యాక్‌డ్రాప్‌తో యాక్షన్, క్రైమ్, ఎమోషన్‌లతో మేళవించిన చిత్రమే ‘ఇరుముడి’. రవితేజ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, తండ్రి–కూతుళ్ల ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలు, మంచి విజువల్స్ సినిమాకు ప్రధాన బలాలు. ఓవరాల్‌గా ‘ఇరుముడి’ ఫ్యామిలీ ఆడియన్స్, రవితేజ అభిమానులు, ముఖ్యంగా తండ్రి–కూతుళ్ల ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

తెలుగుమిర్చి రేటింగ్ : 3.75/5

Exit mobile version