
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
తెలుగు సినిమా ప్రేక్షకులకు హారర్, థ్రిల్లర్ జానర్ అంటే ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఆ లిస్ట్‌లో తాజాగా చేరిన చిత్రం ‘కిష్కింధపురి’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా, రేడియో స్టేషన్ నేపథ్యంలో నడిచే మిస్టరీ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మాణంలో, కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్‌కు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? హారర్, థ్రిల్లర్ అభిమానులకు కొత్త అనుభూతిని ఇచ్చిందా? చూద్దాం..!
కథ : రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్), మైథిలి (అనుపమ పరమేశ్వరన్) గోస్ట్ వాకింగ్ టూర్స్ అనే బిజినెస్ చేస్తూ ఉంటారు. దెయ్యాలున్నాయంటూ పేరుపడిన ప్రదేశాలకు వెళ్ళి, ముందే సెట్ చేసుకున్న ప్లాన్ ప్రకారం టూరిస్టుల్ని భయపెట్టి, నిజంగా దెయ్యాలు ఉన్నట్టు నమ్మిస్తుంటారు. అలాంటి సందర్భంలో అనుకోకుండా కిష్కింధపురి దగ్గర ఉన్న సువర్ణమాయ రేడియో స్టేషన్ కి టూర్ వెళ్ళాల్సి వస్తుంది. కానీ అక్కడ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ముందే ప్లాన్ చేసుకున్నట్టే కాకుండా, నిజంగానే వింత వాయిస్ వినిపించడం, ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోవడం మొదలవుతుంది. ఆ రేడియోలో వినిపిస్తున్న వాయిస్ ‘వేదవతి’దా? లేక వేరే ఎవరూ? అసలు ఆ ఆత్మ ఎవరు? రాఘవ్ ఈ మిస్టరీని ఛేదించి తనవాళ్లని కాపాడగలడా? అన్నది ‘కిష్కింధపురి’ కథ.
విశ్లేషణ : ‘కిష్కింధపురి’ – ట్రైలర్‌తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, రేడియో స్టేషన్ అనే కొత్త సెటప్‌తో ఆసక్తిని రేకెత్తించింది. సినిమా మొదటి భాగంలో కామెడీ, హీరో ఇంట్రడక్షన్ సీన్స్ సాదారణంగా అనిపించినా, కిష్కింధపురి రేడియో స్టేషన్‌కి వెళ్లిన తర్వాత కథ మలుపు తిరుగుతుంది. వరుసగా జరిగే హత్యలు, భయపెట్టే హారర్ సీన్స్, ఆ తర్వాత వచ్చే సస్పెన్స్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. రాఘవ్ – మైథిలి కాంబినేషన్ బాగుంది, టెక్నికల్‌గా కూడా విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా ఇంపాక్ట్‌ను పెంచాయి.
సెకండ్ హాఫ్‌లో దెయ్యం బ్యాక్‌స్టోరీ ఆసక్తికరంగా ఉంటుంది. సువర్ణమాయ రేడియో స్టేషన్‌కి లింక్ చేసిన విధానం కొత్తగా అనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు, హారర్ సీన్స్ ప్రేక్షకులను థియేటర్ సీటుకి అతుక్కుపోయేలా చేస్తాయి. ముఖ్యంగా 1989 కాలానికి తగ్గట్లుగా వేసిన రేడియో స్టేషన్ సెట్ సినిమాకి హైలైట్. రొటీన్ హారర్ టెంప్లేట్‌లోనే సాగినా, స్క్రీన్‌ప్లేలో ఇచ్చిన మలుపులు, కొత్త సెటప్, క్లైమాక్స్ టచ్ ఈ సినిమాకి పాజిటివ్ పాయింట్స్. మొత్తానికి, భయపెట్టే హారర్ ఎలిమెంట్స్‌తో పాటు థ్రిల్ కూడా ఇచ్చే సినిమా కావడంతో హారర్ జానర్ అభిమానులకు ‘కిష్కింధపురి’ ఓ మంచి ఎంటర్టైనర్‌గా నిలుస్తుంది.
‘కిష్కింధపురి’లో రాఘవ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన స్టైల్‌కి తగ్గ యాక్షన్ మాత్రమే కాక, నటనతో కూడా మెప్పించాడు. అనుపమ పరమేశ్వరన్ అయితే ఈ సినిమా హైలైట్‌గానే నిలిచింది. మొదట్లో సింపుల్‌గా కనిపించినా, సెకండ్ హాఫ్‌లో దెయ్యం పట్టిన పాత్రలో ఆమె నటన అదరగొట్టింది. విశ్వరపుత్ర పాత్రలో శాండీ మాస్టర్ లుక్, నటన థ్రిల్లింగ్‌గా అనిపించాయి. చిన్నపాత్రలో తనికెళ్ళ భరణి, చివర్లో స్వామిజిగా మకరంద్ దేశ్‌పాండే, అలాగే తల్లిపాత్రలో నటించిన సీనియర్ హీరోయిన్ కూడా తమ పాత్రలతో ప్రత్యేకంగా నిలిచారు. సపోర్టింగ్ కాస్ట్‌లో హైపర్ ఆది, సుదర్శన్ కామెడీ ట్రై చేసినా అంతగా వర్కౌట్ కాకపోయినా, కథ రనింగ్‌లో అంత ఇబ్బంది కలగలేదు.
టెక్నికల్‌గా చూస్తే, ఈ సినిమాకి అసలైన బలం చైతన్ భరద్వాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. సౌండ్ డిజైన్‌తోనే భయపెట్టే సన్నివేశాలు మరింత ఇంపాక్ట్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్‌కి కొత్త లుక్ ఇచ్చింది. ఆర్ట్ డైరెక్షన్, ముఖ్యంగా సువర్ణమాయ రేడియో స్టేషన్ సెట్స్ రియలిస్టిక్‌గా అనిపించాయి. నిర్మాణ విలువలు బాగా కనిపించాయి. CGI కొన్ని చోట్ల మరింత మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉన్నా, హారర్ ఎలిమెంట్స్‌ను స్క్రీన్‌ప్లేతో బ్యాలెన్స్ చేస్తూ, థ్రిల్లింగ్ అనుభూతిని ఇచ్చారు. మొత్తానికి, ‘కిష్కింధపురి’ హారర్ జానర్‌ని ఇష్టపడేవారికి థియేటర్లో చూసేంత విలువైన థ్రిల్లర్.
కిష్కింధపురి’ హారర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకు థియేటర్లో తప్పక చూడదగ్గ థ్రిల్లర్.
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
