
తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5
నాని హీరోగా నటించిన హిట్: థర్డ్ కేస్ సినిమాపై, ప్రకటించినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం, ముందుగా వచ్చిన హిట్ సిరీస్ మొదటి రెండు సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం మరియు నానికి ఉన్న మంచి క్రేజ్. ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించిన అంశం – నాని ఇందులో ఎస్పీ అర్జున్ సర్కార్ పాత్రలో చూపించిన వైలెన్స్. విడుదలైన ట్రైలర్లు, టీజర్లు సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. మరి ఈ సినిమా ఈ అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.
కథ విషయానికి వస్తే, అర్జున్ సర్కార్ (నాని) హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీంలో ఎస్పీ. కాశ్మీర్‌లో జరిగిన ఒక కేసు కారణంగా అతను బలవంతంగా అక్కడి నుంచీ బయటకు రావాల్సి వస్తుంది. అనంతరం విశాఖపట్నంకు ట్రాన్స్‌ఫర్ అవుతాడు. అక్కడే అతను రెండు హత్యలు చేస్తాడు. ఒక పోలీసు అధికారి ఇలా నేరాలకు పాల్పడటం వెనుక ఏమున్నది? అర్జున్ సర్కార్ చేసిన హత్యల వెనుక అసలు కథ ఏమిటి? అనే మిస్టరీ తెరపై చూడాల్సిందే..
దర్శకుడు కథను నిడివిగా తీసుకున్నా, కథనం ఎక్కడా గ్యాప్ లేకుండా రూపొందించేందుకు ప్రయత్నించాడు. మొదటి భాగంలో కథ కాశ్మీర్ నుంచి విశాఖపట్నం వరకు అర్జున్ సర్కార్ ప్రయాణం, అక్కడ జరిగిన హత్యలు, వాటి వెనుక ఉన్న కనెక్షన్లను ఎస్టాబ్లిష్ చేస్తూ సాగుతుంది. అయితే మొదటి భాగం కొంత నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలిగిస్తుంది. కథ అరుణాచల్ ప్రదేశ్‌కు షిఫ్ట్ అయిన తర్వాత కూడా అదే కొనసాగుతుంది. అయినా ఇంటర్వెల్ సీన్ మంచి హైతో ముగుస్తుంది. సెకండాఫ్‌లో దర్శకుడు స్క్విడ్ గేమ్‌లా ఉండే ఓ వింత ప్రపంచాన్ని చూపించేందుకు ప్రయత్నించాడు. అక్కడ కథ కాస్త తడబడినా, చివరి 20 నిమిషాల్లో మంచి గ్రిప్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. సినిమా ముగింపు భాగం అద్భుతంగా ఉండటంతో, మొత్తం కథకు న్యాయం జరిగింది అనే భావన కలుగుతుంది.
నాని నటన ఈ సినిమాలో హైలైట్‌గా చెప్పాలి. అతను పూర్వపు ఫ్యామిలీ హీరో ఇమేజ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చి, ఒక క్రూరమైన పోలీస్ పాత్రలో బాగా న్యాయం చేశాడు. శ్రీనిధి శెట్టి పాత్ర పెద్దగా లేకపోయినా, కనిపించిన సన్నివేశాల్లో ఆకట్టుకుంది. కోమలి ప్రసాద్, చైతూ జొన్నలగడ్డ, రావు రమేష్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు. చివర్లో అడవి శేష్ ఎంట్రీతో థియేటర్‌లో కేకలు పుట్టించడంలో సందేహమే లేదు. ఇక కార్తీ పాత్ర ద్వారా తదుపరి పార్ట్‌కు సంబంధించిన హింట్ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది.
టెక్నికల్‌గా చూస్తే, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ బాగున్నా, మ్యూజిక్ పరంగా సినిమా వెనకబడింది. మిక్కీ జే మేయర్ తరహా మెలోడీ స్పెషలిస్ట్ చేత ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌కు సంగీతం అందించడంలో సాహసమే కానీ, అది ఫలించలేదు. పాటలు కథా ప్రవాహానికి బ్రేకుల్లా మారాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. అయితే రక్తపు వాడకం, హత్యా సన్నివేశాల డిజైన్ మాత్రం రియలిస్టిక్‌గా ఉంది.
మొత్తంగా చూస్తే, హిట్: థర్డ్ కేస్ ఓ ఎమోషనల్ బేస్ ఉన్న, బ్లడ్ బాత్ థ్రిల్లర్. కథలో కొన్ని చోట్ల నెమ్మదిగా సాగిన ఫీలింగ్ ఉన్నా, క్లైమాక్స్ డెలివరీ, నాని పెర్ఫార్మెన్స్ సినిమాను ఓ సాలిడ్ వాచ్‌గా మార్చాయి. హిట్ సిరీస్‌లో ఇది మరో ఆసక్తికర చాప్టర్‌గా నిలుస్తుంది.
తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5
