Thammudu Review

Movie : Thammudu (2025)
Star Cast : Nithiin, Sapthami Gowda, Laya, Varsha Bollamma, Saurabh Sachdeva, Swasika, Hari Teja, Srikanth Iyyengar, Temper Vamshi, Chammak Chandra And Others.
Director : Sriram Venu
Producers : Raju – Shirish
Music Director : B. Ajaneesh Loknath
TeluguMirchi Rating : 2.5/5
నితిన్ కెరీర్‌లో మళ్లీ పట్టాలెక్కే ప్రయత్నంగా రూపొందిన చిత్రం “తమ్ముడు”. దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాణంలో దిల్ రాజు వంటి టాప్ ప్రొడ్యూసర్, పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్ వాడటం వంటి అంశాలన్నీ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. మల్టీ-జానర్ ఎలిమెంట్స్, ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అయింది?
కథ :
జై (నితిన్) ఒక ప్రతిభావంతమైన ఆర్చరీ ఆటగాడు. ఆసియన్ గేమ్స్‌లో పాల్గొన్న అతని కల వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలవడమే. కానీ ఆటపై సరైన ఫోకస్ లేకపోవడంతో, కోచ్ సూచన మేరకు మానసికంగా ఏదో లోపం ఉందని గుర్తిస్తాడు. చిన్నప్పుడు తన వల్ల అక్క ప్రేమ విఫలమై, ఆమె ఇంటిని వదిలి వెళ్లిన సంఘటన అతనిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఆమెను క్షమించమని అడిగితే తన మనసు హాయిగా మారుతుందని, ఆటలో మళ్లీ ట్రాక్‌పైకి రావచ్చని ఆశించి ఆమెను వెతుక్కుంటూ బయలుదేరతాడు. అతని అక్క ఝాన్సీ (లయ) ఓ నిజాయితీ గల ప్రభుత్వ అధికారిణి. ఓ ఫ్యాక్టరీ ప్రమాదం కేసులో నిజాయితీగా రిపోర్ట్ ఇవ్వబోతున్న ఆమెను అడ్డుకునేందుకు ఫ్యాక్టరీ యజమాని అగర్వాల్ (సౌరభ్ సచ్‌దేవ్) గూండాలను పంపిస్తాడు.
ఈ క్రమంలో జైకి ఆమె అంబరగొడుగు అనే గ్రామానికి జాతర కోసం వెళ్లిన విషయం తెలుస్తుంది. వెంటనే అక్కడికి వెళ్లిన జై, తన అక్కను కలవాలనుకుంటాడు. కానీ అక్కడ ఎదురయ్యే పరిస్థితులు ఊహించని మలుపులు తీసుకుంటాయి. తన అక్కను మరియు ఆమె కుటుంబాన్ని రక్షించాలనే బాధ్యత అతని భుజాలపై పడుతుంది. ఈ సంఘటనల మధ్య చిత్ర (వర్ష బొల్లమ్మ) అతనికి ఎలా అండగా నిలిచింది? రత్న (సప్తమి గౌడ), గుత్తి (స్వసిక) పాత్రలదేంటి? అనేది తెరపై ఆసక్తిగా మారుతుంది. అక్కా-తమ్ముళ్ల మధ్య ఉన్న గాఢమైన బంధం, క్షమాపణ వెనుక ఉన్న బాధ, బలమైన విలన్ ఆటలు – ఇవన్నీ కలిసిన కథే “తమ్ముడు”.
విశ్లేషణ:
సినిమాను ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా స్టార్ట్ చేసి, మధ్యలో క్రైమ్ థ్రిల్లర్‌గా మార్చి, చివరికి యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌గా తీసుకెళ్లారు. ఇదొక రిస్కీ అప్రోచ్. కానీ ఈ మల్టీ-టోన్ నెరేషన్‌ను దర్శకుడు శ్రీరామ్ వేణు పూర్తిగా కంట్రోల్ చేయలేకపోయాడు. ముఖ్యంగా అక్క-తమ్ముడు మధ్య ఉండాల్సిన ఎమోషనల్ కనెక్షన్ ప్రేక్షకుల మనసులను తాకడంలో విఫలమైంది.
అంబరగొడుగు అనే కల్పిత లొకేషన్ కొత్తగా అనిపించినా, సీన్స్, ఫైట్స్, ఎపిసోడ్స్ అన్నీ రియలిస్టిక్‌గా అనిపించలేదు. కథనం ఎమోషన్ ఆధారంగా నడవాలి అన్న దర్శక ఉద్దేశం స్పష్టంగా కనిపించినా, ఆ ఎమోషన్ ట్రాన్స్‌ఫర్ కాలేకపోయింది.
నితిన్‌కు మంచి పాత్ర దొరికినా, కథానాయకుడిగా పూర్తి స్కోప్ లేదు. యాక్షన్ సీక్వెన్స్‌లలో మెప్పించాడు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ తమకు వచ్చిన పాత్రల్లో న్యాయం చేయడానికి ప్రయత్నించారు. లయ పాత్ర బాగా రాసినా, ఆ ఎగ్జిక్యూషన్ లో కొంత లోటు అనిపిస్తుంది. మిగతా నటీనటులు తమ పరిధిలో బాగానే నటించారు. వేణు శ్రీరామ్ కుమార్తె కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది.
సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు ఎక్కువగా లేవు కానీ ఒక పాట మాత్రం గుర్తుండిపోయేలా ఉంది. విఎఫ్ఎక్స్ విషయంలో ముఖ్యంగా క్లైమాక్స్‌లో మరింత నాణ్యత ఉండాల్సింది. నిర్మాణ విలువలు మంచి స్థాయిలో ఉన్నప్పటికీ కొన్ని టెక్నికల్ వర్క్‌లో లోటు కనిపించింది.
ఫైనల్ గా :
తమ్ముడు అనేది ఎమోషన్‌తో నడిచే సినిమా కావాలి అనుకున్న దర్శకుడి ప్రయత్నం మంచి విషయమే కానీ, ఆ భావోద్వేగం ప్రేక్షకులకు పూర్తిగా చేరలేదు. కథలో కొత్తదనం ఉంది, కాని ఆ డెలివరీ లోపించింది. అంతేగానీ అంచనాలు లేకుండా, ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ అనుకొని చూస్తే మాత్రం పాస్‌మార్కులు వేసుకోవచ్చు…
TeluguMirchi Rating : 2.5/5
